కరోనా దెబ్బకు జనం విలవిల..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7కోట్ల 50లక్షలు దాటింటి. అమెరికాలో అత్యధికంగా కోటి 72లక్షల మందికి వైరస్ సోకగా 3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రెండో దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతం మనదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కోటికి చేరింది. దేశంలో కరోనా బారిన పడ్డ వారిలో 95లక్షల మంది కోలుకున్నారు. లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. మార్చిలో లాక్‌డౌన్ విధించేనాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 600లకు చేరుకుంది. అప్పటికే 13 మంది చనిపోయారు. మొదటి కరోనా మరణం మార్చి 12న కర్ణాటకలో రికార్డయ్యింది. సౌదీ అరేబియా వెళ్లివచ్చిన కాలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరిణించాడు. అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నాటినుంచి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన రికార్డులూ ఉన్నాయి. సెప్టెంబర్ లో 26లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్‌లోనూ వైరస్ తీవ్రత కొనసాగింది. నవంబర్ నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది కేంద్రం. వీటిలో రోజూ దాదాపు 10లక్షలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 15కోట్ల 89లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భారత్‌లో త్వరలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవువుతోంది కేంద్రం. దేశంలో మొత్తం ఆరు వ్యాక్సిన్స్ ట్రయల్ దశలో ఉన్నాయి. కరోనా వైరస్ బయటపడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఆ వైరస్ మూలాలపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది.