వందేళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే !

NAGARJUNA NAKKA
వందేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సమగ్ర భూ సర్వే జరుగనుంది. మూడు విడతలుగా సర్వే చేపడుతోంది ప్రభుత్వం. ఇందుకోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతోంది. 2023 ఆగస్టు నాటికి భూ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఈ రోజు వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. కృష్ణా జిల్లా తక్కోళ్ళపాటు గ్రామంలో ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సర్వేను సమర్థవంతంగా నిర్వహించటానికి ఏపీ ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.

మూడు విడతలుగా జరుగున్న ఈ సర్వే కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. మొదటి విడతలో ఐదువేల గ్రామాలు, రెండో విడతలో 6500, మూడవ విడతలో 5500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. రెండు కోట్ల 26 లక్షల వ్యవసాయ భూములల్లో సర్వే చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో సుమారు మూడు వేల 346 చదరపు కిలోమీటర్లలో సర్వే జరుగుతుంది. సర్వే పూర్తైన తర్వాత భూ హద్దులు నిర్ణయించి సర్వే రాళ్ళను ప్రభుత్వ ఖర్చుతోనే పెట్టి భూ యజమానికి ల్యాండ్ మ్యాప్, ల్యాండ్ టైటిల్ కార్డ్ ఇస్తారు.

స్తిరాస్థికి టైటిల్‌ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు గ్రామ సచివాలయంలో పెడతారు. ఆ టైటిల్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ లోపు ఫిర్యాదు చేయాలి. అభ్యంతరాలు రాకుంటే టైటిల్ దారుడికి శాశ్వత భూహక్కు లభిస్తుంది. ఆ తర్వాత  కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుంది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి 70 బేస్‌ స్టేషన్లు పెడుతున్నాయి.  సర్వే క్రమంలోనే వివాదాలు పరిష్కరించడానికి 660 మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ లను ప్రభుత్వం పెడుతోంది.  

సిబ్బందికి శిక్షణ పై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కొత్తగా 14వేల సర్వేయర్లును ప్రభుత్వం నియమించింది.  9వేల 400 మంది సర్వేయర్లకు శిక్షణ పూర్తయ్యింది. మిగిలిన వారికి జనవరి 26 కల్లా పూర్తి చేయనున్నారు. అటు తిరుపతి సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ప్రత్యేకంగా భూ సర్వే అకాడమి కూడా ఏర్పాటు చేయనుంది. దీని కోసం 40 ఎకరాలను కేటాయిస్తూ తాజాగా మంత్రి మండలి కూడా ఆమోద ముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: