నోటీసులివ్వాలని ఫైనల్ గా నిర్ణయం..!

NAGARJUNA NAKKA
సభా హక్కులకు భంగం కలిగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సభ్యులు అచ్చెన్న, నిమ్మలకు నోటీసులివ్వాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. నోటీసులు జారీ చేసిన పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించనుంది ప్రివిలేజ్ కమిటీ. ఈ క్రమంలో జనవరి 18 లేదా 19వ తేదీల్లో తదుపరి ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. టీడీపీ సభ్యులిచ్చిన ప్రివిలేజ్ కమిటీ నోటీసులు సమావేశం అజెండాలోనే పెట్టలేదు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రాంగణంలో కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ నాలుగు అంశాలపై చర్చించింది. అచ్చెన్నాయుడుపై రెండు నోటీసులు.. రామానాయుడుపై ఒక నోటీసు.. ఇక శ్రీకాకుళం జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పీకర్ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ వచ్చిన ఫిర్యాదులు నోటీసులపై చర్చించింది. స్పీకర్ తమ్మినేనిని అవమానకర రీతిలో వర్ణిస్తూ పత్రికా ప్రకటన చేశారనే అంశంలో జోగి రమేష్ ఇచ్చిన నోటీసు.. బెల్ట్ షాపుల విషయంలో అచ్చెన్నాయుడు సభను తప్పు దోవ పట్టించారనే రెండు అంశాలపై అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ నోటీసులు అందాయి. వైఎస్సార్ చేయూత విషయంలో సభను తప్పు దోవ పట్టించేలా సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ నిమ్మల రామానాయుడుపై చర్యలు తీసుకోవాలన్నా సభ చేసిన తీర్మానం అంశాలను ప్రివిలేజ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశాలను సీరియస్సుగా తీసుకున్న ప్రివిలేజ్ కమిటీ ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.

ఇక కమిటీలో సభ్యునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్.. టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుల అంశాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది జనవరి 18 లేదా 19వ తేదీల్లో తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ రెండో భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ భేటీ నాటికి టీడీపీ సభ్యుల నుంచి వివరణ తీసుకోనుంది. అయితే ఈలోపే తామిచ్చిన ప్రివిలేజ్ కమిటీ నోటీసులను పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ స్పీకరుపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: