క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచిన నిర్ణయం..!

NAGARJUNA NAKKA
గురువారం జరిగిన ఏజీఎంలో.. భారత క్రికెట్‌ జట్టు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్‌ బౌలర్‌ చేతన్‌ శర్మ ఎంపికను ఖరారు చేసింది బీసీసీఐ.అయితే ఈ నిర్ణయం క్రీడాభిమానుల్ని ఆశ్చర్యపరచడమే కాదు.. విమర్శలకు తావిస్తోంది.
చీఫ్‌ సెలెక్టర్‌ విషయంలో.. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కీలకమైన సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్‌ బౌలర్‌ చేతన్‌ శర్మను ఎంపిక చేయడం విమర్శలకు కారణమవుతోంది. నిజంగా చేతన్‌ శర్మకు అంత సీన్‌ ఉందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు క్రికెట్‌ లవర్స్‌.
1987 వరల్డ్‌కప్‌లో ఆడిన చేతన్‌ శర్మ.. మీడియం ఫేస్‌ బౌలర్‌గా తొలి హ్యాట్రిక్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పెద్దగా సత్తా చాటిన దాఖలాలు లేవు. అంతేకాదు.. ఈ ఢిల్లీ పీల్డర్‌కు కపిల్‌దేవ్‌ శిష్యుడిగా తప్ప.. పెద్దగా గుర్తింపు రాలేదు. 1993లో రిటైరయిన చేతన్‌ శర్మ.. చివరి రోజుల్లో పేలవమైన ప్రదర్శనతో విసుగు పుట్టించాడు. మొత్తంగా తన కెరీర్‌లో భారత్‌ తరపున 23 టెస్టులు, 65 వన్డేలు ఆడాడు చేతన్‌.
ఎప్పుడో 27 ఏళ్ల క్రితం రిటైరైన చేతన్‌ శర్మ.. ఇప్పుడు భారత క్రికెట్‌కు ఏంచేయగలడన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా.. టీమిండియాకు జట్టును సమకూర్చగలడా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మొత్తంగా చేతన్‌ను చీఫ్ సెలెక్టర్‌ నియమించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, గత చైర్మన్‌ సునీల్‌ జోషికి 15 టెస్టులాడిన అనుభవం ఉంటే.. చేతన్‌కు 23 టెస్టులు ఆడిన అనుభవం ఉండడం విశేషం.
అయితే చేతన్‌ శర్మను చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించడం వెనుక.. బీసీసీఐ ప్లాన్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చేతన్‌ను డమ్మీగా ఉంచి.. జట్టు కూర్పును తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందనే వాదన కూడా ఉంది. అయితే గతంలో వెంకటేష్ ప్రసాద్‌ను కూడా చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించినప్పుడు ఇలాంటి విమర్శలే వచ్చాయి.
చేతన్‌తో పాటు సెలక్షన్‌ కమిటీలో మాజీ పేసర్లు అబయ్‌ కురువిల్లా, దెబాశిస్‌ మొహంతిలకు కూడా చోటు దక్కింది. మదన్‌ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ.. వీరిని ఫైనల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: