టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

NAGARJUNA NAKKA
తెలంగాణ కాంగ్రెస్ కి సారథి నియామకానికి లైన్ క్లియర్ కాబోతుంది. విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ తిరుగుప్రయాణం కావడంతో ఈ అంశం తేలిపోబోతోంది. ఇన్నాళ్లూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్... పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లు రాష్ట్రంలోని ముఖ్య నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సీనియర్ నాయకులతో సంప్రదింపులు కూడా జరిగాయి. కొందరు సీనియర్లను ఢిల్లీకి పిలిచి పీసీసీ నియామకంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇంతలో రాహుల్ గాంధీ క్రిస్ట్ మస్ వేడుకలకు విదేశాలకు వెళ్లారు. అప్పటికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు అంతా సిద్ధం చేశారు ఇంఛార్జి ఠాగూర్. ఠాగూర్.. వేణుగోపాల్ ఇచ్చిన నివేదికపై మరో సారి సోనియా.. రాహుల్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
పీసీసీ జాబితాలో... ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. సీఎల్పీ నేత భట్టి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా ప్రయత్నాలు సీరియస్ గానే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా సీనియర్లు జట్టు కట్టినా... ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ని ముందుకు నడపడం ఎలా..? అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది ఏఐసీసీ. ఇటు ఒకరిద్దరు సీనియర్లతో రాహుల్‌ మాట్లాడిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి... సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి లతో రాహుల్  మాట్లాడి పేరు ను ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీతో పాటు... ప్రచార కమిటీ... మేనిఫెస్టో కమిటీ.. ప్రోగ్రామింగ్ కమిటీ.. మీడియా కో ఆర్డినేషన్ కమిటీలను కూడా వేయబోతుంది హైకమాండ్‌. సీనియర్లను బుజ్జగించాల్సి వస్తే సీడబ్ల్యూసీకి ప్రత్యేక ఆహ్వానితుడు పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో పీసీసీని ఏఐసీసీ నియమించి ఊరుకునేది. కానీ ఇప్పుడు పీసీసీ లో బాడీ మొత్తం ఏఐసీసీనే నియమిస్తోంది. ఇటీవల తమిళనాడు పీసీసీ ఆఫీస్ బేరర్ల ను కూడా ఏఐసీసీ నే ప్రకటించింది. ఆమోదం కోసం అధిష్టానానికి పంపడం ఆనవాయితీ. అయితే తెలంగాణ పీసీసీ లో అన్ని పదవులు ఏఐసీసీ నే భర్తీ చేస్తుందన్న టాక్ మాత్రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: