ఇదేం రాజకీయం ? బైబిల్ , భగవద్గీతలను రాజకీయం చేస్తారా ?

రాజకీయాల్లో విలువలు అనే వాటికి నాయకులు ఎప్పుడో చరమగీతం పాడేశారు. ఇప్పుడు అన్ని మత రాజకీయాలే. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పే కంటే అన్ని పార్టీలు ఇదే విధంగా తయారయ్యాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలోనూ మత రాజకీయానికి తెర తీశారు బిజెపి నేతలు. అక్కడ ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఏపీలోనూ ఆ తరహా రాజకీయాలు చేసేందుకు కు ప్రయత్నిస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ పట్టుకున్న వారికి ఓట్లు వేస్తారా ? భగవద్గీత పట్టుకున్న వారికి ఓట్లు వేస్తారో తిరుపతి ప్రజలే తేల్చుకోవాలని ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. 




కేవలం రాజకీయాల కోసం ఇలా బైబిల్ ను, భగవద్గీతను అవమానించే విధంగా నాయకులు మాట్లాడడం సరికాదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బైబిల్ విషయం ప్రస్తావించడం ద్వారా ఏపీ లో బిజెపి, జనసేన పార్టీలు దెబ్బ తినే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ ఆ తరహా రాజకీయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు అనేది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. అందుకే ఏపీలో బిజెపి పట్టు సాధించలేక పోతుంది. బండి సంజయ్ వ్యాఖ్యలనే తీసుకుంటే బైబిల్ పట్టుకుని రాజకీయాలకు పనికి రారు అన్నట్లుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా అర్థమవుతోంది. అన్ని మతాలకు,  కులాలకు వేదికైన భారతదేశంలో ఈ విధమైన మతపర విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 




అదికాకుండా 151 సీట్లతో అఖండ మెజారిటీని అందించిన ప్రజల తీర్పుని అవమానించేదిగా ఉంది అనేది అందరి అభిప్రాయం గా కనిపిస్తోంది. కేవలం రాజకీయంగా జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే ఇప్పుడు బైబిల్, భగవద్గీతను ఈ రాజకీయంలోకి లాగి లబ్ధి పొందాలనుకుంటున్న తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: