జగన్‌.. అదే దూకుడు.. ఏమాత్రం తగ్గట్లేదుగా..? ఇప్పుడు బాబు ఏం చేస్తారో..?

Chakravarthi Kalyan
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు నిరంతరం ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాయి.. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటూనే ఉంటాయి. అవసరమైనా కాకపోయినా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటాయి. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం ఇలాంటి విచారణ డిమాండ్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో అంతర్వేది ఘటన సమయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేయగానే.. అంగీకరించేశారు.. ఇప్పుడు రామతీర్థం ఘటన విషయంలోనూ అదే సీన్ రిపీటవుతోంది.

రామతీర్థంలో విగ్రహం ధ్వంసం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రెండు రోజుల్లో దోషులను అరెస్టు చేస్తామని మంత్రి వెల్లడించారు. రామతీర్థం ఆలయాన్ని ఆధునీకరిస్తామని తెలిపారు. ఆలయాలపై దాడుల విషయం ఉన్నతాధికారులతో చర్చించిన వెల్లంపల్లి రామతీర్థం, రాజమండ్రి ఘటనలపై సీఐడీ విచారణకు ఆదేశించారు. రామతీర్థం ఘటన నిందితులను మూడ్రోజుల్లో పట్టుకుంటామన్నారు.

రామతీర్థంను పూర్తిగా ఆధునికీకరణ చేయాలని నిర్ణయించామన్న  మంత్రి వెల్లంపల్లి... ఆగమశాస్త్రం ఆధారంగా విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరుగుతాయని తెలిపారు. రామతీర్థం ఘటన సున్నితమైంది, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని... నిందితులను అరెస్టు చేసేందుకు ఆధారాలు దొరికాయని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. విచారణకు ఆదేశించినందున  మంగళవారం  తలపెట్టిన ర్యాలీ విరమించుకోవాలని బీజేపీని ఆయన కోరారు.

చిన్న గుడుల్లోని తాత్కాలిక విగ్రహాలు ధ్వంసమైతే సర్కారుకు అపాదించటం సరికాదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఆలయాలపై దాడులకు సంబంధించి 88 కేసులే నమోదయ్యాయని మంత్రి  వెల్లంపల్లి తెలిపారు. ఆలయాలపై దాడుల ఘటనల్లో 169 మందిని అరెస్టు చేశామని.. రాష్ట్రంలో 57,584 ఆలయాలు ఉన్నాయని పోలీసుశాఖ మ్యాపింగ్ ఉంటుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 3 వేల ఆలయాల్లోనే సీసీ కెమెరాలు అమర్చారని... సీసీ కెమెరాలపై దేవాదాయశాఖ కార్యాచరణ ప్రణాళిక ఇచ్చిందని తెలిపారు. విజయవాడ బస్టాండులోని రామాలయం ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రైవేట్‌ ఆస్తిగా తెలిపిన మంత్రి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నడుస్తున్న గుడికి వారే భద్రత కల్పించాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: