ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

NAGARJUNA NAKKA
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రక్షాళన జరుగుతోంది. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని సంస్కరణలు చేపడుతోంది ప్రభుత్వం. పేపర్‌ లీకేజీలకు ఆస్కారం లేకుండా పోటీ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీని సిద్ధంచేస్తోంది. భవిష్యత్తు్లో నిర్వహించే ప్రతి పోటీ పరీక్షను ట్యాబ్‌ల ద్వారానే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది ఏపీపీఎస్సీ.
ఏపీపీఎస్సీ కొత్తరూపు సంతరించుకుంది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వివిధ సందర్భాల్లో ఏపీపీఎస్సీ కేంద్రంగా కొంత వివాదం రాజుకుంది. ఆ తర్వాత పరిస్థితి నెమ్మదిగా గాడిన పడింది. ప్రస్తుతం ఏపీపీఎస్సీలో పూర్తి ప్రక్షాళన జరిగింది.  పోటీ పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ చెప్పే దిశగా కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. మొత్తానికి ప్రతిష్టాత్మక ఈ సంస్థకు కొత్త లుక్‌ తీసుకువచ్చింది పీఎస్‌ఆర్‌ టీమ్. ముఖ్యంగా గ్రామ సచివాలయం కార్యదర్శుల ఉద్యోగాల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని విమర్శలను  ఎదుర్కొంది. ఎలాంటి తప్పిదాలు జరగ్గకుండా పూర్తి పారదర్శకతతో పరీక్షలు నిర్వహించామని చెప్పినా.. ప్రతిపక్షం.. ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. ఈ క్రమంలో ఏపీపీఎస్సీపై భవిష్యత్తులో ఈ తరహా ఆరోపణలు రాకుండా ఉండేందుకు పీఎస్సార్‌ పెద్ద కసరత్తే చేశారు. ఐఐఎం, ఐఐటీల్లో పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారు..? నూతన సాకేంతికతో ఏ విధంగా పరీక్షలు నిర్వహించవచ్చని ఆలోచన చేశారు. ఇకపై పరీక్షల నిర్వహాణ ట్యాబుల ద్వారా చేపట్టాలని నిర్ణయించారు.
ఇకపై ప్రతి పోటీపరీక్ష ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. పరీక్ష రాయడానికి వచ్చే ప్రతి అభ్యర్థికి సెంటర్‌కు రాగానే ఒక్కో ట్యాబ్‌ ఇస్తారు. సమయం కాగానే ట్యాబ్‌కు ప్రశ్న పత్రం నేరుగా చేరుకుంటుంది. ఆ తర్వాత పరీక్ష ప్రారంభం అవుతుంది. దీని వల్ల పేపర్‌ లీకేజీ ఘటనలనేవి ఇక తలెత్తే ప్రసక్తే ఉండదు. అలాగే ప్రింటింగ్‌ ప్రెస్‌లో నాలుగైదు సెట్ల పేపర్లను ప్రింట్‌ చేయించడం.. వాటిని పరీక్ష కేంద్రాలకు పంపడం.. అక్కడ లాటరీ తీసి ఆ మేరకు సెట్‌ను బయటకు తీయడం వంటివాటికి ఇక కాలం చెల్లినట్లే. ఇకపై ట్యాబ్‌కు నేరుగా క్వశ్చన్‌ పేపర్‌ వస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా ఆన్‌ లైన్‌లోనే రాసేస్తారు అభ్యర్థులు. ఇక పరీక్షా సమయం ముగియగానే ఆన్‌ లైన్‌ బంద్‌ అవుతుంది. అలాగే వాల్యూయేషన్‌ కూడా ఆన్‌లైన్‌ పద్దతిలోనే కానిచ్చేస్తుంది ఏపీపీఎస్సీ. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షల నిర్వహణ చేపట్టొచ్చనేది ఏపీపీఎస్సీ అంచనా. ఇటీవల నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేసింది ఏపీపీఎస్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: