అడ్డగోలుగా టిక్కెట్ల రేట్లు !
ఈ పండుగ సమయంలోనే కరోనా నష్టాలన్నీ పిండుకోవాలని భావిస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. అందుకే ఒక్కసారిగా టిక్కెట్లు డబుల్ పెంచేశాయి. సాధారణ రోజుల్లో ఆరు వందల రూపాయలకు దొరికే టిక్కెట్ ఇప్పుడు పదిహేను వందల పైమాటే. ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టమున్నట్లు దోచుకుంటున్నాయి. ప్రయాణీకుడి అవసరాన్ని ఆసరగా చేసుకొని దోపిడీకి తెర తీశాయి.
హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన పట్టణాలకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఇక సంక్రాంతి కావడంతో ఈ నెల 12, 13, 14, 15 తేదీల్లో టిక్కెట్ దొరకడమే గగనంగా మారింది. ప్రైవేట్ వాళ్లైతే టిక్కెట్లు మా సర్వీస్ లో లేవు. మరో సర్వీస్ లో అరెంజ్ చేస్తామని చెప్పి అందిన కాడికి దండుకుంటున్నారు. అడిగినంత ఇస్తేనే ఆ టికెట్లు కూడా దొరుకుతాయంటున్నారు. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, గుంటూరు నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు అలాగే బెంగుళూరుకి ప్రయాణించే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడేలా.. టికెట్ ధరలు నిర్ణయిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సాధారణ రోజుల కంటే రెండు, మూడింతల అధిక ధరకు టికెట్లను అమ్ముతూ ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నారు. కరోనా కాలంలో సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల టిక్కెట్ రేట్లు చూస్తుంటే.. అంతకంటే తక్కువ ధరలో విమానంలో వెళ్లొచ్చెమో అన్నట్లుగా ఉంది పరిస్థితి.