కేసీఆర్ ఇంతగా మారిపోతారని ఎవరూ ఊహించలేదుగా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఊహించని విధంగా మార్పు కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ ఏ నిర్ణయాలు , విధానాలను వ్యతిరేకించారో ఇప్పుడు అవే నిర్ణయాలపై సానుకూలంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన చాలా నిర్ణయాలు, పథకాలను తెలంగాణలో అమలు చేసేందుకు గతంలో ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. వ్యతిరేకిస్తూ ఉండేవారు. కానీ కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ లో ఊహించని విధంగా మార్పు కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసిన తర్వాత కెసిఆర్ స్పీడ్ బాగా తగ్గిపోవడం, కేంద్రంపై సానుకూల వైఖరితో ఉన్నట్లుగా వ్యవహరిస్తుండడం, గతంలో ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోవడం, కేవలం తెలంగాణ రాజకీయాలకే పరిమితం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. 



అంతకు ముందు బిజెపిని ఇరుకున పెట్టే అంశాలు వేటినీ కేసీఆర్ వదిలిపెట్టేవాడు కాదు. ముఖ్యంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మద్దతు ప్రకటించారు. అలాగే రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు సైతం మద్దతు పలికి నిరసనలు తెలిపారు. కానీ ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ బిజెపి పెద్దలను కలిసిన తర్వాత ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే ఢిల్లీ వెళ్లిన సమయంలో రైతు నిరసన దీక్షకు మద్దతు ప్రకటిస్తారు అని అంతా భావించగా, కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే తెలంగాణకు వచ్చేశారు.అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్ ను సైతం పక్కన పెట్టారు. తెలంగాణలో నియంతృత్వ సాగు విధానానికి పూర్తిగా స్వస్తి పలికారు. 




కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ను చేర్చారు.ఒక్కసారిగా కేసీఆర్ ఇలా వరాల జల్లులు కురిపిస్తూ ఉద్యోగులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నిస్తూ, కేంద్ర బిజెపి పెద్దలతో సఖ్యత గా ఉండటానికి ప్రధాన కారణం 2022లో జమిలి ఎన్నికల విషయాన్ని కేంద్రం కేసీఆర్ చెవిన వేయడమేనని, అందుకే కేసీఆర్ లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: