అలర్ట్: వాహనదారులు తస్మాత్ జాగ్రత్త సుమీ..!?

N.ANJI
నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి వాహనాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక వాహనం వేగంగా నడిపించడం చట్ట రీత్యా నేరం. సెక్షన్ 112 ప్రకారం వేగ పరిమితులకు విరుద్ధంగా మోటారు వాహనాన్ని నడిపితే శిక్షార్హులవుతారు. లైట్ వెహికల్‌ అయితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకూ జరిమానా విధించడం జరుగుతుంది. చిన్న, పెద్ద వాహనమైతే రెండు వేల నుంచి 4 వేల వరకూ జరిమానా ఉంటుంది. అయితే అదే నేరాన్నీ రెండోసారి చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అధికారం ఉంది.

ఎవరైతే మోటారు వాహనాన్ని అతి వేగంగా... లేదా ప్రజలకు ప్రమాదకరమైన రీతిలో నడుపుతారో అలాంటి వారిని శిక్షించే అధికారం ఉంది. మొదటిసారైతే ఐదు వేలు రూపాయలు జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుంది. అదే రెండోసారి జరిగితే ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష విధించడవచ్చు. పది వేల రూపాయలు ఫైన్ కూడా ఉంటుంది.

నిరంతరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ శాతం మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా నిలుస్తోంది. మద్యం తాగి ఎవరైనా డ్రైవ్ చేస్తే వాహన నియంత్రణపై అదుపు ఉండదు. అందుకే మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఆరు నెలల వరకూ జైలు శిక్ష లేదంటే పది వేల రూపాయల ఫైన్ విధించవచ్చు. అదే నేరం మరోసారి రిపీట్ అయితే 15 వేల రూపాలయతో పాటు రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది.

ఏదైనా వ్యాధి లేదా వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి మోటారు వాహనాన్ని నడిపినా నేరమే అవుతుంది. అతడు నడపడం ప్రజలకు ప్రమాదానికి కారణమవుతుందని తేలితే.. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అదే విధంగా వాహనాన్నీ నడుపుతూ యాక్సిడెంట్ చేసినా, రూల్స్ పాటించడంలో విఫలమైనా అలాంటి  నేరానికి జైలు శిక్ష, జరిమానా కూడా విధించడం జరుగుతుంది. సెక్షన్ 132, 133, 134 ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష, ఐదు వేల రూపాయలు వరకూ జరిమానా విధించడం జరుగుతుంది. ఒక సంవత్సరం వరకూ జైలు శిక్ష పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మూడు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. లేదా ఐదు వేల రూపాయల జరిమానా వేయడం జరుగుతుంది. లేదా రెండింటితో శిక్ష వేయవచ్చు. అదే నేరాన్ని రెండో సారీ రిపీట్ చేస్తే ఒక ఏడాది పాటు జైలుశిక్ష, పది వేల రూపాయలు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను నియంత్రించేందుకే ఈ కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: