ఎడిటోరియల్ : ఘోరకలికి ఎవరు బాధ్యులు?

గల్లీలో వుండి కూడా ఢిల్లీని తిట్టే రాజకీయాల్ని ఒంటబట్టించుకున్న మనకు పుట్టినా, చచ్చినా రాజకీయాలు చేయడం బాగా తెలుసు. ఒకటి కాదు- రెండు కాదు. ఉరివేసుకోవడమో, ఏట్లో పడడమో, కాలేజీ బంగళాపై నుంచి దూకడమో, నదుల్లో ఊడ్చుకొని పోవడమో, రైళ్ల కింద పడడమో, నేరుగా రైలు గుద్దడమో- ఏదైతేనేమి బంగారు భవిష్యత్తు బుగ్గిపాలైందని శాపనార్థాలు పెట్టే మనం, పసి పిల్లల్ని ‘చదు వు’అనే విషంతో రకరకాలుగా హింసిస్తూ, చంపుతున్నాం. చంపుతూ బతుకుతున్నాం. రైల్వేలు నిన్ననో, మొన్ననో ఏర్పాటుచేసినవి కావు. మానవ రహిత లెవల్ క్రాసింగ్‌లు రాత్రికి రాత్రే వెలసినవి కావు. దాదాపు మన ప్రాంతంలో వీటికి 80 సంవత్సరాల చరిత్ర వుంది. వీటికి బలౌతున్న విగత జీవుల కథలున్నాయి. అన్ని సంఘటనల తర్వాత మళ్లీ అదే మృత్యు ఘోష! ఆరోపణాస్త్రాలు, లల్లూప్రసాద్ రైల్వేమంత్రిగా వున్న హయాంలో లెవల్ క్రాసింగ్ దగ్గర సిబ్బందిని పెట్టడం రైల్వేలకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నదని భావించి, ప్రాముఖ్యత లేని ప్రాంతాల్లో మొత్తంగా ఎత్తివేసారు. ఇవే సంఘటనలు పునరావృత్తం గావడం, రైల్వేశాఖపై ఒత్తిడి పెరగడంతో, తిరిగి ప్రాధాన్యతా క్రమంలో వాటిని పునరుద్ధరించడమే కాకుండా, కొత్త ప్రాంతాల్లో కూడా పక్కా భవనాలను నిర్మించారు, నిర్మిస్తున్నారు. ఈరోజో, రేపో వాటికి పూర్తి భద్రతతో కూడుకున్న వ్యవస్థ ఏర్పాటురాబోతున్నది. మాసాయిపేట వద్దగల గేటు దీనే్న చూపుతున్నది. సిబ్బంది భవనం నిర్మితమై మిగతా పనులకు ఎదురుచూస్తున్నది. అంతలోనే ఘోరం జరిగిపోయింది. సంఘటన స్థలంలోని విగత జీవులైన పసి హృదయాల్ని, వారి కన్న తల్లిదండ్రుల్ని చూస్తుంటే, వారంతా కానె్వంట్ విద్యకై, కార్పొరేట్ విద్యకై పాకులాడే వారిలా ఏ ఒక్కరు కనపడలేదు. అంతా చిన్న కమతాల వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి వారే! ఈ కుటుంబాల్ని మభ్యపెట్టి, దరిద్రపుగొట్టు మంచి ఆంగ్లభాష అని, కానె్వంట్ అని, తోక తగిలించుకున్న టెక్నో స్కూలనే గారడీ మాటలతో ఆకర్షించి, డొనేషన్లు లేవని దొంగ కథనాల్ని అల్లి, పంటలు పండిన తర్వాత ఫీజులు కట్టచ్చని నచ్చచెప్పి, అడవిలో కుందేళ్ళ వేటను సాగించినట్లు గ్రామాల్ని జల్లెడపట్టి పిల్లల్ని పదులకొద్ది కిలోమీటర్ల దూరానికి తరలించడం ఓ దరిప్రుగొట్టు విద్యా సంప్రదాయంగా మారింది. కాళ్ళకు బూట్లని, మెడలో ఓ ఉరితాడుని, వీపుపై ఓ గాడిద మోతని, ఓ చేతిలో టిఫిన్ బాక్స్‌తో నీళ్ళని (ఈ స్కూళ్ళల్లో కూడా నీటి కటకట వుంటుందన్న మాట!) ఉదయానే్న కాలకృత్యాలు కూడా తీర్చుకోలేక బడి అనే గుదిబండ పేరున ఊర్లోకి వచ్చిన జైలు అనే స్కూలు బస్సును పిల్లలెక్కుతుంటే ఎంత సంబరమో! చూచి తరించడమే గాని, మాటల్లో చెప్పలేం! అదే ఆవాస ప్రాంతంలో బడి అనే ఓ ఆవరణ వుంటుంది. దానికి కొన్ని గదులుంటాయి. మెదక్ లాంటి జిల్లాలోనైతే చక్కని ప్రహరిగోడ, అందులో చెట్లూ వుంటాయి. అటూ ఇటూ తిరిగే పంతులమ్మలు, పంతులయ్యలు వుంటారు. వారు కావల్సినంత రాజకీయాల్ని మాట్లాడుతారు. కొత్తగా ప్రకటించబోయే ఇంక్రిమెంటు గూర్చో, అవశేష రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సు పెంచినట్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కూడా పెంచితే బాగుండునని, పెంచాలని, యూనియన్లు డిమాండ్ ఎందుకు చేయడంలేదని, చేయాలని, తమతమ పిల్లలు ఎంచక్కా, ఎక్కెడెక్కడ, ఎలా ర్యాంకులు సాధిస్తున్నారో పరస్పరం ఇచ్చుపుచ్చుకునే ధోరణితో చర్చించుకుంటారు. కొత్త ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలు గాని, విద్యారంగంలో చోటుచేసుకోవాల్సిన మార్పులుగాని, తమతమ వృత్తిప్రావీణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలుగాని వారికి పట్టవు(వెయ్యిలో ఒకరిద్దరుండవచ్చు!). 2009లో రూపొందిన విద్యాహక్కు చట్టంగాని, అందులో ఉపాధ్యాయులు పాటించాల్సిన విధులు గాని, భారంగా మారిన చదువుపై యశ్‌పాల్ కమిటీ రిపోర్టు గాని, దానిపై విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులుగా ఎలా స్పందించాలని గాని, ఎన్‌సిఎఫ్ 2005 (కరికులం గూర్చి) గాని, అందులోని అంశాల్ని తరగతి గదిలో ఎలా తీసుకెళ్ళాలని గాని పట్టదు. వృత్తిశిక్షణలో చదువుకున్న వివిధ కమిషన్ల గూర్చి, కొఠారీ కమిషన్ ప్రస్తావించిన కామన్, నైబర్‌హుడ్ స్కూళ్ళ విషయంగాని, వారు పనిచేస్తున్న ఆయా పాఠశాలల్లో వాటిని ఎలా అమలుచేయగలరో చర్చించరు. పైగా ఈమధ్యన వీరికి తెలిసిందల్లా ఆవాస ప్రాంత పిల్లల్ని ప్రభుత్వ బడులల్లో చేర్పించమని ప్రాధేయపడడం తప్ప. అయినా వీరి మాట వినే నాధుడెవరు? ఉన్నత వర్గాల పిల్లలు ఎప్పుడో మన బళ్ళకు దూరమయ్యారు. అన్ని వర్గాల్లోని ఉద్యోగస్థుల పిల్లలు, ఆర్థికంగా బాగున్న కుటుంబాలు పిల్లలు ససేమిరా అంటున్నారు. కొన్ని వర్గాల పిల్లలు (చాకలి, మంగలి, సుంకరి, బేగరి మొ.) అసలు బడి దరిదాపుల్లోకే రావడం లేదు. ఇక వచ్చేదెవరంటే, కుందేళ్ళ వలకు తట్టుకునే ఆర్థిక స్థితి లేనివారు, విద్యాగంధం అవసరాన్ని గుర్తించని వారు, ఇంటికే పరిమితమై ఇంటి పనులతోపాటు, పాఠశాలకు పోవచ్చని భావించే కుటుంబాల పిల్లలు, లేదా ప్రభుత్వ బడి వేటకు తలొగ్గినవారు మాత్రమే ఈ బడుల్లోకి వస్తున్నారు. అందులో కూడా ఆడపిల్లలే అధికం. ఈ వర్గాల్లోని మగపిల్లలు కూడా ‘తోకల’ స్కూళ్ళకే పోవడం జరుగుతున్నది. ప్రపంచీకరణ తర్వాత, ఇతర దేశాల్లో జరుగుతున్న అన్ని విషయాలు తెలుస్తున్నాయి. గల్ఫ్ దేశాలు మొదలుకొని అమెరికా దాకా విద్యారంగం స్థితిగతులు చర్చిస్తున్నాం. కొందరు మేధావులు అమెరికాలోని ప్రభుత్వ విద్యావిధానంపై ఆశ్చర్యం వెలిబుచ్చుతూ కథనాలు రాస్తూ వుంటారు. వీరెవ్వరికి భారతదేశపు విద్యావిధానం గూర్చి పట్టదు. వీరే సిద్ధాంతరీకించిన చట్టాలు పట్టవు. ఒక్కరంటే, ఒక్క ఎంఎల్‌సి కౌన్సిల్లో విద్యాహక్కు చట్టం గూర్చి, అమలుతీరు గూర్చి మాట్లాడలేదు. పైగా తెలంగాణ రాష్ట్రానికి ముగ్గురు ఉపాధ్యాయ, ముగ్గురు పట్ట్భద్ర ఎంఎల్‌సిలున్నారు. వీరికి వారివారి వ్యక్తిగత రాజకీయలబ్ది తప్ప, ప్రజా విద్యగూర్చి, ప్రాథమిక హక్కుగా మారిన విద్య గూర్చి, సర్వశిక్షా అభియాన్ ప్రవచించిన మూడు సూత్రాల గూర్చి పట్టదు. మన కళ్ళముందే, మనపక్కనుంచే కోళ్ళను తీసుకెళ్ళే వాహనాల్లా పిల్లల్ని ఆటోల్లో, బస్సుల్లో బరువైన బ్యాగులతో తరలిస్తుంటే, చదువనే బట్టీలో ఉదయం 8గంటలనుంచి, సాయం త్రం 7 దాకా, రమారమి 11 గంటలపాటు పాఠశాల గదుల్లో బట్టీ పెట్టుతుంటే మనకు మాటలు రావు. ఆటో బోర్లాపడితేనో, అందులో పసి కూనలు చస్తేనే, పేపర్లో ఎంచక్కా ప్రకటనల్ని ఇవ్వవచ్చు! కల్గించాల్సిన రాజకీయ రొంపిని కల్గించవచ్చు! కొఠారీ 50 సంవత్సరాల క్రితమే ఏం సెలవిచ్చాడు- అందుబాటులో స్కూలుండాలన్నాడు. సర్వశిక్షా అభియాన్ చెప్పేదేంటి- అందుబాటులో స్కూలు. అంటే, ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటర్ పరిధిలో, ఉచ్ఛతర మూడు కిలోమీటర్ల పరిధిలో, సెకండరీ అయిదు కిలోమీటర్ల పరిధిలో విధిగా వుండాలి. ఓ పాఠశాలకు ఈ పరిధిలో మరో పాఠశాల ఉండకూడదు. ఈ పరిధికి బయటగల పిల్లల్ని, అతి దూరాల్నుంచి వచ్చే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ పాఠశాల (ప్రభుత్వ పాఠశాలతో సహా) చేర్చుకోవద్దు. కాని మన పాఠశాలల ఏర్పాట్లు ఈవిధంగా వున్నాయా అంటే, గ్రామాల్లో మాత్రం వున్నాయి. మండల, పట్టణ, జిల్లా, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో పుట్టగొడుగులు, ఊళ్లపుట్టలు. వీటికి అనుమతినిచ్చే దెవ రు...? రాజకీయ పలుకుబడిగలిగి, నాయకుల్ని మచ్చిక చేసుకుని వృత్తినే ధర్మంగా భావిస్తున్న మండల విద్యాశాఖాధికారులు, ఉపవిద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు. ఓ పాఠశాల పక్కన, దగ్గరలో మరో పాఠశాల పెడుతుంటే, ముందేగల పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అనుమతి పత్రం (ఎన్‌ఓసి) మొత్తం 23 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్కటి వెతికినా కనపడదు. ఈరోజు విద్యాశాఖ, ఆదాయ వనరుశాఖగా మారిం ది. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా, అధికారులు అధికారుల్లా ఎక్కడా కనపడరు. వారు చెప్పుకుంటే తప్ప! మరెందుకీ విధానం దెబ్బతిన్నది... ఉపాధ్యాయుల్ని అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని అంటే ఉపాధ్యాయుల్ని, హోల్ మొత్తంగా తల్లిదండ్రుల్ని ఆరోపించడం! రిక్షాకార్మికుడి పిల్లలుకూడా కానె్వంట్లో చదువుతుంటే... అంతటా వినవచ్చే సమాధానం. మరి మనకెందుకు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగం- అజమాయిషి. అంటే- మనమే సిండికేట్లుగా మారి ప్రైవేట్ బడుల్ని పెట్టుకోవడానికి, ఆయా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని మభ్యపెట్టి మనం నడిపే పాఠశాలలకి తరలించడానికి, ఇలా సంపాదించిన డబ్బుతో అధికారులకి, రాజకీయ నాయకులకి చేతులు తడపడానికి, మన పిల్లల్ని సూపర్ టెక్నో, డూపర్ టాలెంట్ స్కూళ్ళల్లో చదివించడానికి. పోనీ ఈ పెట్టుబడి పాఠశాలల్లోనన్నా వారి వారి పిల్లలు చదువుతున్నారా అంటే, అదీకాదు- వీరు ఆర్థికంగా బాగున్నారు కాబట్టి ఆ స్కూళ్ళు మరింత డాబుగా, ఇంటర్నేషనల్‌గా వుండాలి. పోనీ, ఈ స్కూళ్ళలోనన్నా 1-1-1994నాటి జివో(1) అమలులో వుందా అంటే, ఉపాధ్యాయులకే కాదు, ఈ రంగాన్ని అజమాయిషి చేసే మండలాధికారికి, ఉప విద్యాధికారికి, జిల్లా విద్యాధికారికి, హోల్ మొత్తంగా విద్యాశాఖ కమిషనరేట్‌కే తెలియదు. ఇక మన ఎంఎల్‌ఎలకు, ఎంపిలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రులకు తెలియకపోవడమే మంచిది. తెలిస్తే గిలిస్తే కామన్ స్కూలు విధానం, నైబర్‌హుడ్ స్కూలు విధానం ఆచరణలోకి వస్తే- అబ్బో...! వస్తే... చచ్చినట్లు తమ తమ పిల్లల్ని అలగాజనం పిల్లలతో చదివించడమా? కలలో కూడా ఇది జరగొద్దు. అందుకే ఈ తెలవని తతంగం. తెలుసుకోవద్దనే దొంగాట. పోయినోళ్ళు ఉన్నోళ్ళ తీపిగుర్తులు కాబట్టి, కిష్టాపూర్ లెవల్ క్రాసింగ్‌వద్ద ఒక స్థూపాన్ని, తూఫ్రాన్‌లోని కాకతీయ టెక్నో స్కూలువద్ద మరొక స్థూపాన్ని నిర్మిస్తే భావితరాలకు మన విద్యావిధానపు వాసనల్ని అందించిన వారవౌతాం. అందుకే రండి! చందాల్ని పోగుచేద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: