దేశానికి ఏమయింది.. ఎందుకిలా జరుగుతోంది..!
పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరిస్తుండటంతో పంజాబ్ సర్కార్ అలర్ట్ అయింది. కోళ్లతో పాటు శుద్ధి చేయని మాంసం దిగుమతులను నిషేధించింది. ఇక ఈ వైరస్ మధ్యప్రదేశ్‌లోని 13 జిల్లాలకు పాకింది. ఇక 27 జిల్లాల్లో దాదాపు 1,100 కాకులు మృతి చెందాయి. దీంతో అగర్ మల్వా జిల్లాలోని పౌల్ట్రీ మార్కెట్‌లో వైరస్ ఉందని తేలడంతో దానిని వారం రోజుల పాటు మూసివేశారు. ఇక చత్తీస్‌ఘడ్‌లోనూ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. బలోద్ జిల్లాలో కోళ్లు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపించారు.
ఓ వైపు కేంద్రం చర్యలు చేపడుతున్నా వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో అధికారులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం లేఖ రాసింది. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకకుండా ఉండేందుకు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. జంతువుల కళేబరాలు ఆరుబయట పడేయకుండా పూడ్చిపెట్టేలా చూడాలని చెప్పింది. తగినన్ని పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించింది. బర్డ్ ఫ్లూపై ఎలాంటి అపోహలు ప్రచారం కాకుండా చూడాలని పేర్కొంది కేంద్రం.
తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. కానీ కొన్నిచోట్ల పక్షులు, కోళ్లు చనిపోతుండడంతో జనాల్లో భయాందోళన పెరిగింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. వనపర్తి జిల్లా కొత్తకోటలోనూ నాటుకోళ్లు చనిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసితో పాటు పొన్నారి, హస్నాపూర్, బండల్‌నాగపూర్, అంబు గావ్, జామిడి తదితర గ్రామాల్లోనూ కోళ్లు చనిపోతున్నాయి. అయితే కోళ్లు చనిపోయింది బర్డ్‌ఫ్లూ వల్ల కాదని స్పష్టం చేశారు పశుసంవర్ధక అధికారులు.