వైసీపీలో ఆ సీనియ‌ర్ రెండిటికి చెడ్డ రేవ‌డేనా ? జ‌గ‌నే లైట్ తీస్కొన్నాడా ?

VUYYURU SUBHASH
రాజ‌కీయాల్లో కుద‌రు లేక‌పోతే.. ఏం జ‌రుగుతుందో .. ప‌దే ప‌దే ప‌ద‌వుల వెంట‌ప‌డితే.. ప‌రిస్తితి చివ‌ర‌కు ఎలా మారుతుందో.. ఆ యన ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలిచార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చినంత మాత్రాన ప‌దవులు వెంట‌నే వ‌చ్చే య‌వు. దీనికి ఎన్నో ఈక్వేష‌న్లు, సీనియార్టీ వంటివి ప‌నిచేస్తాయి. అయితే.. ఈ విష‌యం తెలిసి కూడా చాలా మంది నాయ‌కులు పార్టీలు మారుతూ ఉంటారు. ఏదో ఆశ‌.. ప‌ద‌వి ద‌క్క‌క పోతుందా? అనే ప్ర‌య‌త్నం.. అయితే.. ఈ క్ర‌మంలో ఒక పార్టీనుంచి మ‌రో పార్టీలోకి జంప్ చేసి.. అక్క‌డితో స‌రిపెడితే.. ప‌రిస్థితి వేరేగా ఉంటుంది. కానీ, అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. మారుతూ పోతుంటే.. రాజ‌కీయంగా న‌మ్మ‌కం అనే తాడు తెగిపోయే ప్ర‌మాదం ఉంటుంది.

ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ద‌ళిత నాయ‌కుడు, ప్ర‌జ‌ల పెన్నిధిగా ఒక‌ప్పుడు పూజ‌లు అందుకున్న నేత‌.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు. 1990ల‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన డేవిడ్ రాజు.. టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. జెడ్పీ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత కాలంలో 1999లో సంత‌నూత‌ల పాడు నుంచి టీడీపీ టికెట్ సంపాయించుకుని ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. త‌ర్వాత ఎర్ర‌గొండ పాలెం నియోజ‌క‌వ‌ర్గానికి మారిన ఆయ‌న 2009లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత రాష్ట్ర విభ‌‌జ‌న నేప‌థ్యంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే 2014లో వైసీపీ టికెట్ సంపాయించుకుని విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రాక‌పోయే స‌రికి.. టీడీపీలోకి జంప్ చేశారు. త‌న‌కు ఏదైనా ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించారు. అయితే.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వీ ఇవ్వ‌లేదు. ఇక‌, 2019 ఎన్నిక‌ల నాటికి.. టీడీపీ త‌ర‌ఫున టికెట్ కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస‌రికి ఆ పార్టీ చెంత‌కు చేరిపోయారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది క‌నుక క‌నీసం త‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వి అయినా ఇవ్వాలంటూ.. జిల్లాలో కీల‌క మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.

అయితే.. ఇప్పుడు డేవిడ్ రాజు హ‌వా ఎక్క‌డా ప‌నిచేయ‌డం లేదు. దీంతో వైసీపీ నేత‌లు.. అధిష్టానం కూడా ఆయ‌న‌ను  పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోప‌క్క అనుచ‌ర గ‌ణం కూడా త‌గ్గిపోయింంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. కానీ, టీడీపీ ప‌రిస్థితే బాగోలేద‌ని ఉన్న కొద్దిపాటి అనుచ‌రులు చెబుతున్నారు. దీంతో రాజ‌కీయంగా డేవిడ్ రాజు.. తీవ్ర సంక‌ట స్థితిలో ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: