బ్రేకింగ్ న్యూస్: ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు

అమరావతి: ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పరిటాలలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో బుధవారం పాల్గొన్నారు. భోగి మంటల్లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జోవో కాపీలను వేసి దగ్దం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓటేశారని అన్నారు. తాను ఏం తప్పు చేశానో తనకు తెలియదని, ప్రజలంతా అభివృద్ధి చెందాలనే తాను కృషి చేశానన్నారు. ఒక వేళ తాను చేసిన తప్పు అదే అయితే ప్రజలు తనను క్షమించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా లేరని, రైతులకు న్యాయం జరిగే వరకు తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

వరుస విపత్తుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వారికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదన్నారు. రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలను కూడా కొనసాగించాలని తెలుగు దేశం పార్టీ కేంద్రాన్ని కోరుతుందని పేర్కొన్నారు. అబద్దాలతో ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానంటూ జగన్ అడ్డంగా దొరికిపోయిన దొంగ అని అన్నారు. జగన్ పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు.

పట్టణ ప్రాంతాల్లో పెంపుడు జంతువుల పైన కూడా పన్నులు విధిస్తున్నారని, రేపో మాపో గాలిపై కూడా జగన్ ప్రభుత్వం పన్ను విధిస్తుందంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లు అయిన పోలవరం, అమరావతిని జగన్ పొడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై లక్షా 30 వేల కోట్ల అప్పును, 70 వేల కోట్ల పన్నులను మోపిందని వివరించారు. అంటే.. ఏపీలోని ప్రతి పౌరుడిపై ఇప్పటికే రూ. 70 వేల భారం మోపినట్టు అని చంద్రబాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: