పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

P.Phanindra
రాజమండ్రి: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోన సీమలో కోడి పందేలు జోరు అందుకుంటాయి. వీటిని ప్రభుత్వం బ్యాన్ చేసినా పందేల రాయుళ్లు ఏదో ఒక చోట రహస్యంగా తమ పనులు చేసేసుకుంటూ ఉంటారు. ఈసారి కోడి పందేలపై పూర్తిగా నిషేధం విధించామని, వీటిని నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా సదరు కోడి పందేల నిర్వాహకులు మాత్రం ఈ హెచ్చరికలు పట్టించుకోవడం లేదు. యధావిధిగా తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఆదేశాలు అసలు అమలు కాకుండా పోయాయి. కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ఆంక్షలు విధించినా లెక్క చేయని పందెం రాయుళ్లు, నిర్వాహకులు భారీ స్థాయిలో బరులు సిద్ధం చేసుకున్నారు.
ఆత్రేయపురం మండలంలో జోరుగా కోడి పందేలు జరిగాయని సమాచారం. బొబ్బర్లంక, పేరవరం, తాతపూడి గ్రామాల్లో కోడి పందేలు జోరుగా నిర్వహించారట. దీంతో ఆత్రేయపురం - పేరవరం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానికులు చెప్తున్నారు. ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. అయినా సరే పోలీసులు మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా పందేలు వేసేది ఖాయమని రాజకీయ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 20 కిపైగా పెద్ద పెద్ద బరులు, వందకుపైగా చిన్న బరులు రెడీ చేసి పందేలు ఆడారట.
పెద్ద ఎత్తున జరిగే పందేలను తిలకించేందుకు పందెపు రాయుళ్లు కోనసీమకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. బుధవారం భోగి పండుగ సందర్భంగా కీలక పందేలు నిర్వహించే ప్రాంతాల్లో గుండాట, పేకాట, మద్యం షాపుల నిర్వహణ కోసం బహిరంగ వేలం కూడా నిర్వహించినట్లు కొంత మంది చెప్తున్నారు. మరి ఈ వార్తలపై పోలీసులు, అధికారులు ఎలా స్పందిస్తారో, అలాగే రేపు సంక్రాతి రోజైనా ఈ పందేలను అడ్డుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: