అమ్మఒడి వల్లే ఆ అమ్మ చనిపోయింది..
మద్యానికి బానిసైన భర్త భీమన్న.. తాగడానికి అమ్మఒడి సొమ్మున ఇవ్వలేదనే కారణంతో భార్య దేముడమ్మను బండతో కొట్టి చంపాడు. విశాఖ జిల్లా గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయాలని భర్త భీమన్న ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి దేముడమ్మ ససేమిరా అంది. పిల్లల భవిష్యత్ కోసం, వారి విద్యావసారకోసం డబ్బులు వాడాలని, తాగడానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. సంతనుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆమెను బండతో కొట్టి చంపేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
లక్షలమంది తల్లుల జీవితాల్లో వెలుగులు నింపి సంక్రాంతి పండగను రెండు రోజుల ముందుగానే ఇంటికి తీసుకొచ్చిన అమ్మఒడి పథకం ఒక తల్లి ఉసురు తీయడం స్థానికంగా కలకలం రేపింది. అమ్మఒడి సొమ్ము ఇచ్చినట్టే ఇచ్చి లేకపోయినా ఆ కుటుంబంలో కలతలు లేకుండా ఉండేవని అంటున్నారు కొంతమంది. తల్లిలేని అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి సొమ్ములు అందుకున్నకుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. పండగలకు పిల్లలకు కొత్త బట్టలతో సహా.. ఇతర అనేక అవసరాలకు అమ్మఒడి అండగా ఉందని, తమ ఆర్థిక అవసరాలు తీర్చిందని సంతోషపడుతున్నారు లబ్ధిదారులు.