భూమా అఖిల ప్రియకు మరో షాకిచ్చిన పోలీసులు

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న భూమా అఖిల ప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నించారు. దాదాపు మూడు రోజుల నుంచి భూమా అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. కిడ్నాప్‌లో అసలు ఎవరెవరు పాల్గొన్నారు.. కిడ్నాప్ స్కెచ్ ఏంటి? ఈ కిడ్నాప్‌కు సంబంధించి భూమా అఖిల ప్రియ పాత్ర ఎంత? భర్త భార్గవ్ రామ్ పాత్ర ఎంత అనే దానిపై మూడు రోజుల పాటు విచారించారు. అఖిల ప్రియ కిడ్నాప్‌కు సంబంధించి ఇచ్చిన కీలక సమాచారం ద్వారా ఈ కేసులో మిగిలిన నిందితులను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం రెండు గంటల్లోపు అఖిల ప్రియను బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
అనంతరం ఆమెను న్యాయమూర్తి నివాసంలో హాజరు పరుస్తారు. న్యాయమూర్తి ఎదుట హాజర పరిచిన తరువాత తిరిగి ఆమెను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి లోధా అపార్ట్ మెంట్ నుంచి బోయిన్ పల్లి స్పాట్ వరకు కిడ్నాపర్లు ఏ వివరాలు వదిలారో వాటన్నిటి గురించి భూమా అఖిల ప్రియను ప్రశ్నిస్తున్నారు. అయితే అఖిల ప్రియ కొన్ని విషయాలకు సంబంధించి నోరు విప్పలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఎక్కడుంది ఇంకా తెలియ రాలేదు.
తన భర్త ఎక్కడున్నాడనే దానిపై కూడా పోలీసులు భూమా అఖిల ప్రియను విచారిస్తున్నారు. కాగా.. పోలీసులు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మరో 15 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందుతులైన చంద్రహాస్, భార్గవ్, గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ లభిస్తే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు మొత్తం వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: