కనుమకు బర్డ్ ఫ్లూ బెడద ఉంటుందా..?

Siva Prasad
కొన్ని రోజులుగా బ‌‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న క్రమంలో తెలుగువారు కనుమ పండుగ ఎలా జరుపుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. సంక్రాంతి తరువాత రోజు అందరూ చేసుకునే కనుమ నాడు కోడి కూర ముక్క కొరికే సంప్రదాయం వస్తుంది. ఎవ్వరైనా ఆ రోజు నీచు ముక్క తినాల్సిందే. అయితే కోళ్లకు సోకే బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కనుమ సంగతేంటని తెలుగు ప్రజలు కంగారు పడుతున్నారు.
                           యూపీ‌, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, మ‌హారాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ప‌లు రాష్ట్రాల్లో ఉన్న‌ట్టుండి పెద్ద ఎత్తున కాకులు, కోళ్లు మృతి చెందుతుండడం క‌ల‌కలం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణ‌లోని నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లోనూ పెద్ద ఎత్తున కోళ్లు చనిపోవడం గ‌మ‌నార్హం. ఈ క్రమంలో తెలుగు రాష్ర్టాల్లోనూ బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలోనూ చికెన్, కోడి గుడ్లు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
                     బర్డ్ ఫ్లూ ఉందో..? లేదో..? కొన్నాళ్లు చికెన్ తినకుండా ఉంటే పోలా అని ఎక్కువ మంది తెలుగు ప్రజలు భావిస్తున్నారు. అయితే కనుమ రోజు ముక్క కొరకాలి కదా అందుకు ఏం చేయాలని పలువురు యోచిస్తున్నారు. చికెన్ బదులుగా మటన్ ముక్క కొరికేందుకు కొందరు రెడీ అవుతుంటే.. మరికొందరు ఏదైనా నాన్ వెజే కదా అంటూ చేపలు తింటే సరి అని సిద్ధమవుతున్నారు. కాదు పర్లేదు అని చికెన్ తినేందుకు రిస్క్ చేస్తారేమో కనుమ రోజు చికెన్ అమ్మకాలు చూస్తే తెలిసిపోతుంది. బర్డ్ ఫ్లూతో జాగ్రత్త అంటున్నప్పటికీ ఆంధ్రప్రాంతంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు విరివిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా చికెన్ తింటానికి ఏ మేరకు చొరవ చూపుతారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: