విషాదం: శోభనం రోజే పెళ్ళికొడుకు ఆత్మహత్య.. ఎందుకంటే..!?
ఇక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్న కుమారుడు సోమేశ్ అలియాస్ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహమైంది. సంప్రదాయం ప్రకారం 11వ రోజైన మంగళవారం రాత్రి శోభనానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే స్నేహితులను కలిసేందుకు బయటకు వెళ్లిన సోమేశ్ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
అయితే రాత్రి కావడంతో స్నేహితులంతా ఎవరింటికి వారు వెళ్లిపోగా..సోమేశ్ కూడా ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రంతా సోమేశ్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు తెల్లవారుజామున అతడి స్నేహితుల ఇంటికి వెళ్లి వాకబు చేయగా తమ ముందే ఇంటికి బయలుదేరాడని చెప్పారు. దీంతో వారు గ్రామంలో గాలించగా పూరింట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోభనం రోజు రాత్రే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో వధువుతో పాటు బంధువులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.