ఎవరూ ఊహించి ఉండరు..!
ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో 59వ ఇనాగురల్ సెర్మనీ జరగబోతోంది. అయితే తమ దేశంలో మునుపెన్నడూ లేని పరిస్థితుల్ని ఈ సందర్భంగా అమెరికన్లు చూడబోతున్నారు. కరోనా పరిస్థితులు, ఇటీవల క్యాపిటల్ హిల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. జో బైడెన్ ప్రమాణ స్వీకార వేడుకల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు.
గత అధ్యక్షుల తరహాలోనే క్యాపిటల్ భవనం పశ్చిమ ద్వారం వద్ద బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల సంఖ్యను అనూహ్యంగా తగ్గించేశారు. సాధారణంగా తమకు నచ్చిన వాళ్లను ఆహ్వానించేందుకు కాంగ్రెస్ సభ్యులకు పలు టికెట్లు ఇచ్చే వాళ్లు. కానీ ఈ సారి కాంగ్రెస్ సభ్యునితో పాటు ఒకర్ని తీసుకొచ్చేందుకు మాత్రమే వీలుంది. తద్వారా అతిథుల సంఖ్యను వేయి 70 మందిని మాత్రమే అనుమతించనున్నారు.
చాలా మంది అమెరికన్లు ప్రెసిడెంట్ ఇనాగురల్ కార్యక్రమానికి హాజరుకావాలని భావిస్తారని... అయితే, భద్రతే తమ తొలి ప్రాధాన్యత అంటున్నారు. వారం క్రితం జరిగిన దాడితో కరోనా ప్రభావం దృష్ట్యా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు అధికారులు.
సుమారు 20 వేల మంది నేషనల్ గార్డ్స్ దళాలను ఇప్పటికే మోహరించారు. ట్రంప్ అభిశంసనకు ప్రతినిధులు సభ తీర్మానం చేసినప్పటి నుంచే భద్రతా దళాలను రంగంలోకి దించారు. ఒక్క వాషింగ్టన్‌లోనే కాదు... అన్ని రాష్ట్రాల్లోని క్యాపిటల్ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. క్యాపిటల్ భవనం కిటికీలను పూర్తిగా మూసివేశారు. ఆందోళనకారులు సులభంగా లోనికి ప్రవేశించే అవకాశం లేకుండా చెక్కలు దిగ్గొట్టారు. ఇల్లినాయిస్ స్టేట్ భవనం వద్ద కూడా ఇటువంటి ఏర్పాట్లే చేశారు అధికారులు. వాషింగ్టన్ మాన్యుమెంట్స్ వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ట్రంప్ అనుకూల వర్గం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపొచ్చనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు... క్యాపిటల్ హిల్‌పై దాడి తర్వాత వాషింగ్టన్‌లో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం లాక్‌డౌన్ ప్రకటించింది. హోటళ్లు, ఇతర వ్యాపారాలతో పాటు విమానయాన సంస్థల ఆఫీసుల వద్ద భద్రత పెంచింది.