ఒక మహిళ ఎడారిలో...ప్రజల దాహం తీర్చింది...!
1998లో రాజస్థాన్‌లో సంభవించిన కరువు గురించి విన్న ఆమెకు అక్కడి ప్రజలకు ఎలా అయినా సహాయం చేయాలని ఆలోచన వచ్చింది.
అదే సంకల్పంతో ముందుగా సమస్యకు కారణమైన అంశాలను తెలుసుకుంది. వారి నీటి కొరత సమస్యలను పరిష్కరించడానికి ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను (Aakar Charitable Trust) ఏర్పాటు చేసింది. ఆ ట్రస్టు ద్వారా నీటి కరువుతో అల్లాడుతున్న అక్కడి గ్రామాలకు నీటిని రిజర్వ్ చేసేలా చెక్ డ్యామ్ లను నిర్మించింది. నీటి అవసరాలకు అనుగుణంగా వీటిని గ్రామాలకు అందించేలా సిద్ధం చేశారు.
ఆ ట్రస్టు ద్వారా సేకరించిన విరాళాలతో... 25% గ్రామ ప్రజల నుండి సేకరించిన ధనంతో.... డ్యామ్ లను, బావులను, నీటి కుంట లను ఏర్పాటు చేశారు. తక్కువ వర్షపాతం పడినా సరే... ఆ నీరు కుంటలలోకి, నీటి బావులలోకి చేరేలా నిర్మించారు. అలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీటివలన అక్కడి ప్రజలు లబ్ధిపొందారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు మెరిశాయి. ఒకప్పుడు గొంతు తడుపుకోవడానికి కూడా కరువుగా ఉన్న నీరు... ఇప్పుడు వారు సాగు చేయడానికి సైతం సరిపోయేంత నీటి వసతి పెరిగింది.
రాజస్థాన్‌లో ఈ ట్రస్ట్ ద్వారా 2000 నుంచి 2005 సంవత్సరం వరకు 200 నీటి కుంటలను, బావులను నిర్మించారు రుయా. ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ 2006 నుంచి 2018 వరకు రాజస్థాన్‌లో 317 చెక్ డ్యామ్‌లను నిర్మించింది. తద్వారా 182 గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీరి ప్రజలు ఆనందంగా ఉన్నారు. ట్రస్ట్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులు పూర్తి కావడానికి రూ.11 కోట్లను విరాళాల ద్వారా సేకరించారు. మరో రూ.4.7 కోట్లు గ్రామస్తులు అందించి ఈ మహాయజ్ఞంలో భాగమయ్యారు. అది కూడా ఆమె వారిలో నెలకొల్పిన చైతన్యమే చెప్పచ్చు. అక్కడి గ్రామస్తులు కూడా ఆమెను ఎంతగానో నమ్మారు.
నీటి వనరులు పెరగడం వల్ల క్రమంగా గ్రామాల్లో ఆదాయం కూడా పెరిగింది. ఇదంతా ఆమ్లా రుయా గారి కృషి ఫలితం.... ఆమె మాపై చూపిన దయ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రజలకు సేవ చేయడం అంటే నేరుగా ధనాన్ని అందించడం ఒకటే మార్గం కాదు.... ఇలా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చాటిచెప్పారు ఆమ్లా రుయా.