వైసీపీకి మరో షాక్.... జగన్‌కు దెబ్బ మీద దెబ్బ...!
ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడాన్ని ఒక్క అధికార పార్టీ మినహా విపక్షాలన్నీ స్వాగతించాయి. అంతే కాదు పాత ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. ఈ షాక్ నుంచి ప్రభుత్వం, వైసీపీ కోలుకోక ముందే ఆ పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. గత మార్చిలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు చాలా జిల్లాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. కడప, చిత్తూరు, నెల్లూరు లాంటి జిల్లాల్లో జిల్లా పరిషత్ పీఠం సైతం ఎన్నికలు జరగకుండానే వైసీపీ ఖాతాలో పడింది.
అప్పట్లో అధికార పార్టీ వాళ్లు మిగిలిన పార్టీలకు చెందిన వాళ్లను బెదిరించి చాలా స్థానాలు తమ ఖాతాలో ఏకగ్రీవం చేసేసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ మళ్లీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఎంపీటీసలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఎస్ఈసీ ఆ ప్రక్రియ మొత్తం రద్దు చేసి మళ్లీ ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇప్పటి వరకు వైసీపీ ఖాతాలో ఏకగ్రీవంగా పడిన సీట్లు అన్ని క్యాన్సిల్ అయ్యి.. మళ్లీ ఆ స్థానాలకు ఎన్నికలు తప్పవు.