ఎం.ఐ.ఎం... ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన ఈ పార్టీ.. ఇప్పుడు విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. దేశవ్యాప్తంగా మైనారిటీలను.. ప్రత్యేకించి ముస్లింలను సంఘటిత పరచి రాజకీయ శక్తిగా రూపొందించాలని ఎం.ఐ.ఎం. నేతలు ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచీ హిందూవాత పోకడలున్న బీజేపీతో ఎం.ఐ.ఎం ఎప్పుడూ వ్యతిరేకమే. నరేంద్రమోడీపైనా ఘాటు విమర్శలు చేసిన చరిత్ర ఎం.ఐ.ఎం ది. మరి అలాంటి పార్టీ మోడీని సపోర్ట్ చేస్తోందా.. ?
అవుననే అంటున్నారు మన దిగ్విజయ్ సింగ్.. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్లా పార్టీ పతనం కావడానికి ఈయనే కారణమని విమర్శలు వచ్చాయి. ఆయన మరోసారి హైదరాబాద్ కు వచ్చి పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నెహ్రూజయంతి నుంచి ఇందిర జయంతి వరకు వారం రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక సభ్యత్వ నమోదులో పాల్గొనేందుకు ఆయన రామచంద్ర కుంతియాతో కలసి సికింద్రాబాద్ కు వచ్చారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందువల్ల.. నగరంలో పార్టీ పరస్థితిపై సమీక్షించిన దిగ్విజయ్ టీఆర్ఎస్, ఎంఐఎంలు కుమ్మక్కయ్యాయంటూ విమర్శించారు.
భాజపా, ఎంఐఎంలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని.. ఆ రెండు పార్టీలు ఒకే నాణెం లాంటివని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ముస్లింలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని.. మోడీని సమర్థించేలా ఎంఐఎం వ్యవహారం ఉందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కావడం దీనికి నిదర్శనమన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసమే ఎంఐఎం ఎన్నికల బరినుంచి తప్పుకున్నట్లు దిగ్విజయ్ ఆరోపించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని..గెలుపు, ఓటములు సహజమేనని తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: