సంగారెడ్డి: ఇందిరమ్మ బాటలో భాగంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం కిరణ్ మరికొన్ని గంటల్లో మెతుకు సీమకు వస్తున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామనీ తెలంగాణవాదులు హెచ్చరించిన నేపథ్యంలో కిరణ్ పర్యటన సజావుగా సాగుతుందా? లేదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కిరణ్ పర్యటన విజయవంతం చేసేందుకు పాలక పక్షం ఎంతయితే కష్టపడుతుందో...తెలంగాణవాదులు కూడా అంతేస్థాయిలో నిరసనలు తెలపడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పర్యటనకు వస్తున్న సీఎం కిరణ్ తొలుత మండల కేంద్రమైన దుబ్బాకకు చేరుకుంటారు. ఇక్కడి నుంచీ ప్రారంభమయ్యే ఇందిరమ్మ బాట పటాన్ చెరు నియోజకవర్గంతో ఈ నెల 31న సాయంత్రంతో ముగుస్తోంది.
సీఎం పర్యటన కోసం జిల్లా అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లను చేశారు. సీఎం పర్యటనను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతో ప్రతిష్టగా తీసుకున్నారు. అయితే, తెలంగాణవాదులు మాత్రం తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పిన తరువాతనే మెతుకుసీమ గడ్డపై సీఎం కిరణ్ అడుగుపెట్టాలంటున్నారు. ఈ మేరకు నారాయణఖేడ్ మండలంలో సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దుబ్బాక నియోజక వర్గంలో కూడా తెలంగాణవాదులు సీఎం పర్యటనను అడ్డుకుంటామంటున్నారు. సీఎం కిరణ్ పర్యటన అడ్డుకోవడానికి దొమ్మాట మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పక్కా స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక నియోజక వర్గంలో తెలం‘గానం’ అధికంగా ఉంది. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత గడ్డ అయిన సిద్ధిపేట కంటే దుబ్బాకలోనే తెలం‘గానం’ ఎక్కువగా వుంది.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు దుబ్బాక నియోజకవర్గానికి వచ్చినప్పుడు దుబ్బాక ప్రాంత తెలంగాణవాదులు బాబుకు చుక్కలు చూపించారు. అదే సిద్దిపేటలో బాబుకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గానికి సీఎం కిరణ్ వస్తున్నారు. తెలంగాణవాదులకు తోడుగా తెలంగాణ జర్నలిస్టులు కూడా సీఎం కిరణ్ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. జీవవైవిధ్యసదస్సు సందర్భంగా మీడియాకు జరిగిన పరాభవానికి క్షమాపణ చెప్పి మెతుకుసీమలో అడుగుపెట్టాలనీ జర్నలిస్టులంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించి రావాలనీ తెలంగాణవాదులంటున్నారు. ఈ క్రమంలో వస్తున్న కిరణ్ పర్యటన కొంత టెన్షన్ గా మారింది. రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వైపు జర్నలిస్టులు, మరోవైపు తెలంగాణవాదులు సీఎం కిరణ్ పర్యటనలో తమ నిరసనను వ్యక్తం చేయాలనీ నిశ్చయించుకున్నారు. అయితే, జిల్లా ఎస్పీ అవినాశ్ మహంతి మాత్రం సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. సీఎం పర్యటనలో ఎవర్నిపడితే వారికి అనుమతి లేదు.
సీఎం వేదికనే కాకుండా సభా వేదిక ముందు కూడా బారీకేడ్లను తన కనుసైగల్లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. నిరసన తెలిపి అడ్డుకుంటే కేసులు పెడుతాననీ హెచ్చిరంచారు. అయినప్పటికీ తెలంగాణవాదులు, జర్నలిస్టులు తమ నిరసనను సీఎంకు తెలిపేందుకు పక్కా ప్రణాళికను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు మెతుకు సీమలో జరిగే సీఎం కిరణ్ ప్రోగ్రాంకు ఎవరు అడ్డుతగిలినా చూస్తూ ఊరుకోమనీ ఇప్పటికీ మెదక్ ఎస్పీ అవినాష్ హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లను చేసుకున్నారు. అయితే, ఎవరెన్ని చేసినా తమ నిరసనను వ్యక్తం చేయడమే కాకుండా, తెలంగాణ రుచి ఏమిటో సీఎం కిరణ్కు చూపెడుతామనీ తెలంగాణవాదులంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: