జోరుగా...హుషారుగా...

సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గడ్డ మెతుకు సీమలో ముఖ్యమంత్రి కిరణ్ ఇందిరమ్మ బాట ఎంతో జోరుగా హుషారుగా సాగుతోంది. జిల్లాలోని సిద్ధిపేట నియోజక వర్గం మినహా జిల్లా అంతటా కిరణ్ ఇందిరమ్మ బాట నడిచింది. ఈ బాటలో మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట షెడ్యూలును ప్రకటించినప్పటి నుంచీ తెలంగాణవాదులు ఈ ఇందిరమ్మబాటకు అడ్డుపడుతురానీ, ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాటలో కిరణ్కు నిరసనలు తప్పవనీ అందరూ అనుకున్నారు.  కానీ, అందరి అంచనాలకు భిన్నంగా మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట మూడు రోజులుగా ఎలాంటి అడ్డంకులు లేకుడా సాఫీగా సాగుతోంది. ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో పాటు పలువురు ఉద్యమకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణవాదం బాగా ఉందనుకునే మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట సాఫీ జరుగుతుండటం...ఇందిరమ్మ బాట సందర్భంగా గజ్వేల్, సంగారెడ్డి, జహీరాబాద్, వెల్దుర్తి, మెదక్, నారాయణఖేడ్, ఆందోల్, పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు, ర్యాలీలకు వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడం కాంగ్రెస్ శ్రేణులకు నూతనోత్సవాన్ని ఇచ్చిందనీ చెప్పాలి. సీఎం కిరణ్ కూడా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, కొండాపూర్ లలో నిర్వహించిన కార్యక్రమాలకు అశేష జనవాహిని తరలి వచ్చింది. తెలంగాణ ఉద్యమం పుట్టినింట్లో వేలాదిగా జనం, కార్యకర్తలు తరలిరావడం చూసి ముఖ్యమంత్రి కిరణ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భారీగా తరలి వచ్చిన జనం తనపట్ల చూపిస్తున్న ఆదరణ చూసిన కిరణ్ తన సొంత జిల్లాకు పోతే ఎంత ఆనందంగా ఉంటుందో ఇక్కడే అలాగనే వుందనీ, మెదక్ జిల్లాకు తానెంతో రుణపడి ఉంటాననీ కిరణ్ అనడం చూస్తుంటే...ఇక్కడ ఇందిరమ్మ బాట ఎంతగా సక్సెస్ అయ్యిందో వేరే చెప్పనక్కర్లేదు. గంటల తరబడి కార్యక్రమాలు ఆలస్యంగా జరిగిన తన కోసం వేచి ఉన్న జనంను చూసి కిరణ్ ఎంతో సంతోషపడటమే కాకుండా...ఆయా నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు అడిగిందే తడువుగా అన్నింటిని మంజూరు చేశారు. ముఖ్యంగా గజ్వేల్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు అడిగిన ప్రతి పనిని మంజూరు చేశారు. ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించే విషయమై కేంద్రంతో ఇప్పటికే మాట్లాడాననీ, ఇది వచ్చే విధంగా తప్పకుండా పనిచేస్తాననీ అన్నారు. అదే విధంగా తెలంగాణ విషయమై కూడా తాను అనేక మార్లు కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లాననీ, త్వరగా తేల్చాలనీ కోరినట్లు కూడా కిరణ్ చెప్పారు. మొత్తానికి మెదక్ జిల్లా ఇందిరమ్మబాట సూపర్ డూపర్ గా సాగిందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందిరమ్మ బాట నేటితో ముగియనున్నది.సాఫీ జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: