వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

Chakravarthi Kalyan
కొన్నిరోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక అదిరిపోయే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. జగన్‌ ప్రభుత్వం రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడంలేదని, తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రాజశేఖర్‌ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా పక్కనపెడుతూ వచ్చారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేశారట. తానేమిటో అన్నకు చూపించాలన్న పట్టుదలతో ఉన్న షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారట.  ఫిబ్రవరి మొదటి పక్షంలో, బహుశా ఫిబ్రవరి 9వ తేదీన తాను రాజకీయ పార్టీని  ప్రారంభించబోతున్నట్టుగా  విలేకరుల సమావేశంలో ప్రకటించాలని  షర్మిల నిర్ణయించుకున్నారట.

అయితే ఆ కథనంపై షర్మిల స్పందించారు.  ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి కథనం విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని.. ఈ కథనాన్ని వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా ఆమె అభివర్ణించారు. ఆ కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నానన్నారు  షర్మిల. ఏ పత్రిక అయినా.. ఏ ఛానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని షర్మిల అంటున్నారు. అలా రాయడం ఒక నీతిమాలిన చర్య అని అన్నారు షర్మిల.

దీనికి తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్కే స్పందించారు. నిజానికి తాను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదంటున్నారు ఆర్కే. ఎవరో తయారుచేసిన ప్రకటనపై షర్మిల అయిష్టంగా సంతకం చేసినట్టుగా ఆ ప్రకటనను చూస్తే ఎవరికైనా అర్థమవుతుందంటున్నారు.  శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసిందీ నాకు తెలియదనుకుంటున్నారా ? అంటూ నిలదీశారు. తాను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్‌ పట్టుకుని చెప్పగలరా? అలా చెప్పిన రోజు నేను బహిరంగంగా క్షమాపణ చెబుతానంటూ సవాల్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: