జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..
పొదలకూరు మండలంలో తోడేరు 1965లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నిక జరిగినా ఏకగ్రీవమే. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి రమణారెడ్డి ఇక్కడ ఏకంగా 20ఏళ్లపాటు సర్పంచిగా పనిచేశారు. ఆయన ప్రతిసారీ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యేవారు. పొదలకూరు పంచాయతీ సమితి ప్రెసిడెంటుగా 18 ఏళ్లు ఏకగ్రీవంగా కొనసాగారాయన. రమణారెడ్డి తర్వాత ఆయన సతీమణి కాంతమ్మ తోడేరు సర్పంచిగా పనిచేశారు. 1986లో జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్నిక జరిగింది. ఎస్సీలకు ఆ స్థానం రిజర్వు చేయడంతో కొత్తవారు ఎంపికయ్యారు. ఆ తర్వాత కూడా యథాతథంగా ఏకగ్రీవాలే కొనసాగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలోనే ఉన్న తిమ్మాజీ కండ్రిగది కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ 35ఏళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. జాతీయ ఉత్తమ పంచాయతీగా తిమ్మాజీ కండ్రిగ పేరు తెచ్చుకుంది. అభివృద్ధి విషయంలో నేతలందరూ ఒకే మాటపై నిలబడతారు. దీంతో సర్పంచి ఎన్నిక అవసరమే లేకుండా పోయింది. 2001లో జరిగిన ఎన్నికల్లో సర్పంచి పదవి ఎస్సీకి రిజర్వ్ కావడంతో తొలిసారి ఎన్నిక జరిగింది.
నెల్లూరు జిల్లా డక్కిలి మండలం నడింపల్లి పంచాయతీకి కూడా ఏకగ్రీవాల్లో రికార్డు ఉంది. ఈ పంచాయతీగా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఆరుగురు సర్పంచులు ఎన్నికకాగా అందులో ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన వారే. అంటే ఒకే ఒక్కసారి మాత్రమే అక్కడ ఎన్నిక జరిగిందనమాట. ఈ గ్రామంలో విశేషం ఏంటంటే.. అవధూత వీరయ్య తాత గుడి వద్ద ఏకగ్రీవం చేసుకుంటారు. ఆ తర్వాత వారే ఎన్నికల్లో నామినేషన్ వేస్తారు. ఏకగ్రీవంకోసం పాట జరిగితే.. వచ్చే డబ్బుని కూడా వీరయ్యతాత గుడి అభివృద్ధికి కేటాయిస్తారు.