అఖిలప్రియ భర్త భార్గవ్ మాస్టర్ బ్రెయిన్.. ఖాకీలకు చుక్కలు చూపిస్తున్నాడా?
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పాత్ర కూడా కీలకమని పోలీసులు గుర్తించారు. ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది. అఖిల ప్రియ విచారణలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ఈ కిడ్నాప్‌లో భార్గవ్ రామ్ దీ కీలకపాత్రేనని తెలుస్తోంది. కేవలం పథకం వేయడమే కాదు.. ఆ పథకాన్ని భార్గవ్ రామ్ దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేశాడట కిడ్నాపర్లను అనుసరించి భార్గవ్ రామ్ బోయినపల్లి వరకూ వెళ్లాడట. అంతా అనుకున్న దాని ప్రకారమే జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాడట. అంతా అనుకున్నట్టుగానే కిడ్నాప్ పూర్తి చేశారట.
అయితే భార్గవ్‌రామ్ ఫోన్ కాల్స్ కూడా గుర్తించిన పోలీసులు ఆయన్ను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఏమీ చేయలేకపోయారు. అటు భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇక ఇంత పక్కాగా భార్గవ్ ప్లాన్ చేయడానికి అతని క్రిమినల్ బ్యాక్ గ్రౌండే కారణం అంటున్నారు పోలీసులు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు ఈ కేసులు ఏ3 గా నమోదు చేసారు. అఖిలప్రియ భర్తకు నేర చరిత్ర ఉంది. భార్గవ్ రామ్ ను గతంలో ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున జరిగిన ఘర్షణ కేసు, ఇటీవల ఓ క్రషర్ వివాదంలో మరో కేసు ఆయనపై నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఆయనకు కోర్టుకు హాజరు కావడంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెంగుళూరులో ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారని మొదట్లో కధనాలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం మాత్రం భార్గవ్‌రామ్ దొరికే సూచనలు కనిపించడం లేదు.