ఆ రిజర్వేషన్లతో బంగారు భవిష్యత్తేనా..?

NAGARJUNA NAKKA
ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. విద్యా, ఉద్యోగాల్లో 10శాతం ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీలో ఈ రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు అమలు కానున్నాయి..

అగ్రవర్ణాల్లో పేదలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. ఆర్థికంగా వెనక బడిన తరగతులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లుకు ఎలాంటి ఆటంకం లేకుండా వీటిని అమలు చేస్తారు. గత రెండేళ్లుగా ఈ రిజర్వేషన్లను అమలు చేస్తోంది కేంద్రం. తెలంగాణలోను ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని అగ్ర వర్ణ సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇటీవల అధికారులతో సమావేశం అయినా సీఎం ఇడబ్ల్యూఎస్  రిజర్వేషన్లపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది..

ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు అమలు కానున్నాయి. విద్యా సంస్థల్లో రిజర్వేషన్లపై విద్యా శాఖ, ఉద్యోగ నియామకాల్లో అమలుపై సాధారణ పరిపాలన శాఖలు మార్గదర్శకాలను జారీ చేయనున్నాయి. ఈ రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయి అనే అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ జారీచేసింది. ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటలో మాత్రమే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అంటున్నారు ఉన్నత విద్యా శాఖ అధికారులు. ఇడబ్ల్యూఎస్  కింద 60 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది..

తెలంగాణ సర్కారు ఇప్పటికే వైద్య కళాశాలల్లో అగ్రవర్ణాల్లో పేదలకి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్స్ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో వచ్చే ఏడాది నుంచి అన్ని  రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌కు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: