రెడ్డి సామాజిక వర్గంలో షర్మిల కదలిక.. పార్టీలకు ఎసరేనా ?
వాస్తవానికి చూస్తే.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా పడుతున్న ఇబ్బందులు ఎక్కువే... దాదాపు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కూడా ఇలాంటి అస్తిత్వంలోనే కొట్టుమిట్టాడుతోంది. తమకు ప్రాధన్యం లేకుండా పోయిందని అధికార పార్టీలో రెడ్డి వర్గం ఆపశోపాలు పడుతోంది. ఇక, కాంగ్రెస్‌లో రెడ్డి నేతలు.. పదవుల విషయంలో నువ్వా నేనా అనే రేంజ్‌లో కొట్టుకుంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. రెడ్డి వర్గానికి ఆశించిన విధంగా డయాస్ లభించడం లేదనేది వాస్తవం. ఈ క్రమంలో వీరికి ఒక వేదిక అత్యవసరమనే భావన కూడా ఉంది.
ఇదిలావుంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గంగా ఉన్న తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం.. ఇప్పుడు షర్మిల వైపు చూస్తే.. ఇతర పార్టీల్లో దాదాపు కదలిక ఖాయమని అంటున్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలోని రెడ్డి వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. వారికి పదవుల విషయంలోనూ వైఎస్ అనేక రూపాల్లో మేళ్లు చేశారు. అయితే.. వీరిలో సగంమందికిపైగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. జానారెడ్డి.. తదితరులు.. ఇప్పటికీ గుర్తింపు కోసం వెంపర్లాడుతున్నారు. ఇక, సబిత ఇంద్రారెడ్డి వంటివారు.. మాత్రం కేసీఆర్ గూటికి చేరినా.. స్వేచ్ఛలేదనే భావనతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల కనుక వీరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే.. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి.. హైదరాబాద్ సహా సుమారు.. ఉమ్మడి 10 జిల్లాల్లో 6 జిల్లాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా షర్మిల తీసుకునే లైన్.. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే విధానం వంటివి రెడ్డి వర్గాన్ని ఆకర్షించేందుకు ప్రధానంగా దోహదపడతాయని అంటున్నారు. మరి ఏం జరగుతుందో చూడాలి.