పిల్లలకి జ్ఞాపకశక్తి పెంచాలని ఓ ట్యూషన్ మాస్టర్ ఏం చేశాడో తెలుసా..!?

N.ANJI
పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే బాదాం పెడుతుంటారు. ఇక ఉదయాన్నే లేపి ధ్యానం, యోగా లాంటివి చేయిస్తే పిల్లలకు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే, వారి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతారు. కానీ, ఓ ట్యూషన్ మాస్టర్ మాత్రం పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలని వారి ప్రాణాల మీదకు తెచ్చే సని చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని మండీవాలీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న సందీప్ అనే యువకుడు తమ ఏరియాలో ఉండే 6 నుంచి 9 తరగతుల పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను అతడి వద్ద ట్యూషన్‌కు పంపించడం ప్రారంభించారు. ఇక పిల్లలకు జ్ఞాపకశక్తి పెంచడానికి వారికి సందీప్ ఇంజెక్షన్లు ఇస్తున్నాడు. ఔను మీరు చదివింది నిజమే. పిల్లలకు ఇంజెక్షన్లు ఇస్తే వారిలో మెమొరీ పెరుగుతుందని చెప్పాడు. ట్యూషన్ మాస్టర్ చెబుతున్నాడు కాబట్టి నిజమేననుకుని పిల్లలు భ్రమపడ్డారు. అయితే, ఈ విషయం కొన్నాళ్లు జరిగింది.

ఇక ఓ రోజు ఓ పిల్లాడు తమ ఇంట్లోనే ఇంజెక్షన్ తీసుకుంటుండడంతో విద్యార్థి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆ పిల్లాడిని పట్టుకుని నిలదీశారు. కొంపదీసి తమ పిల్లాడు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నాడేమోనని వారు భయపడ్డారు. ఇదేం పనిరా అని నిలదీస్తే అతడు అసలు విషయం చెప్పాడు. తమ ట్యూషన్ మాస్టర్ సందీప్ ఇలాంటి ఇంజెక్షన్లు ఇస్తాడని, దీన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా పెరిగా చదివినదంతా గుర్తుంటుందని చెప్పాడని ఆ పిల్లాడు తమ తల్లిదండ్రులకు చెప్పాడు.

ఆ తల్లిదండ్రులు ఇతర విద్యార్థుల పేరెంట్స్‌ను కూడా కలిశారు. వారు కూడా తమ పిల్లలను విచారించగా, అంతా ఒకే మాట చెప్పారు. తమ ట్యూషన్ మాస్టర్ అలా చేస్తున్నారని చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపిన తర్వాత నిందితుడు సందీప్‌ను అరెస్టు చేశారు. సందీప్ మెమొరీ పవర్ పెంచుకోవడానికి ఏం చేయాలంటూ కొన్ని యూట్యూబ్ చానల్స్ చూసి.. ఇలాంటి తెలివితక్కువ పని చేశాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. నిందితుడి మీద ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: