తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను దృష్టిలో పెట్టుకుని క్లాసులు మొదలు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ పాఠాల ద్వారా విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టింది తెలంగాణ సర్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతుల పిల్లలకు నేరుగా స్కూల్ కి వచ్చే వెసులుబాటు ఇచ్చింది. అయితే మిగతా క్లాసుల విషయంలో మాత్రం ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇటు ఏపీ ప్రభుత్వం ప్రైమరీ సెక్షన్ కూడా మెదలు పెట్టింది, అటు తెలంగాణ సర్కారు మాత్రం ధైర్యం చేయలేదు. దీంతో ఈ ఏడాది 6, 7, 8 తరగతులతోపాటు ప్రైమరీ సెక్షన్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో ఉన్నాయి.
9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించిన సమయంలోనే 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అయితే 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన సమయంలో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చూసి నిర్ణయం తీసుకోవాలని భావించారు. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి లేకపోయినా, ప్రైవేటు పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 18 రోజులు దాటింది. అయితే కోవిడ్ నిబంధనల అమలు ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగా సాధ్యం కావడం లేదనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. ఈ పరిస్థితుల్లో 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఏదైనా అనుకోని సమస్య వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఒక్క విద్యార్థికి కరోనా ఉన్నా అది అందరికీ సులభంగా సోకే ప్రమాదముంది. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం 6, 7, 8 తరగతులను ప్రారంభిస్తే అదనపు టీచర్లు కావాలి. ఇది మరో సమస్య. ఈ నేపథ్యంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయడమే మంచిదన్న అభిప్రాయంలోనే అధికారులున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రత్యక్ష బోధన అవసరమే లేదనే అభిప్రాయంలో అధికారులున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.