జగన్ కి కుప్పం ప్రజల కృతజ్ఞతలు..

Deekshitha Reddy
ఎట్టకేలకు చంద్రబాబు కుప్పం వచ్చారు. తన నియోజకవర్గ ప్రజల్ని కలిసి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు. అధైర్య పడొద్దని చెప్పారు, వైసీపీ ప్రభుత్వం ఎన్నోరోజులు ఉండదని, మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెప్పారు. అయితే ఇప్పుడే సడన్ గా చంద్రబాబుకి ఎందుకు కుప్పం గుర్తొచ్చింది, కుప్పం కష్టాలు ఎందుకు గుర్తొచ్చాయంటే.. దానికి సీఎం జగనే కారణం అని చెప్పాలి. కరోనా కష్టకాలం తర్వాత ఇప్పటి వరకూ చంద్రబాబు కుప్పం వైపు కన్నెత్తి చూడలేదు. ఏ మీటింగ్ అయినా జూమ్ లోనే ముగించేవారు. అలాంటిది చంద్రబాబు కుప్పం తిరిగి వచ్చే సరికి అక్కడి ప్రజలు దానికి కారకుడైన జగన్ కి ధన్యవాదాలు చెపుతున్నారని నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల్లో పరాభవం మిగిల్చి చంద్రబాబుని సొంత నియోజకవర్గానికి పరిగెత్తుకొచ్చేలా జగన్ చేశారని వైసీపీ నేతలు కూడా సెటైర్లు పేలుస్తున్నారు.

బాబు ఆగ్రహావేశాలు..
చాన్నాళ్ల గ్యాప్ తర్వాత కుప్పం వెళ్లిన చంద్రబాబు జగన్ పై ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. సీఎం జగన్ రాజధర్మం పాటించడంలేదని, కుప్పంపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కుప్పంకి నీళ్లివ్వరా అంటూ ప్రశ్నించారు. ఆనాడు నేను పులివెందులకి నీళ్లిచ్చాను, ఆ తర్వాతే కుప్పానికి ఇస్తానన్నానని గుర్తు చేశారు. కుప్పంలో పులివెందుల రాజకీయం పనికిరాదని హితవు పలికారు.

ఒకసారి బెదిరించారు, రెండోసారి బెదిరించారు. ఇక బెదరం, మాకు అలవాటైపోయింది, భయపడేది లేదని అన్నారు చంద్రబాబు. కుప్పం ప్రజల జోలికొస్తే చూస్తూ ఊరుకోను ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ గెలుస్తుందని, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఎంపీటీసీ, జడ్పీటీసి అభ్యర్థుల్ని వెంటబెట్టుకుని కుప్పం నుంచే ప్రచార పర్వం మొదలు పెట్టారు చంద్రబాబు. పంచాయతీ పోరులో పరాజయం ఎదురుకాకపోయి ఉంటే.. చంద్రబాబు ఇంత త్వరగా కుప్పం రాకపోయి ఉండేవారనేది స్థానిక నాయకుల అభిప్రాయం కూడా. వైసీపీ దెబ్బ గట్టిగా తగిలే సరికి చంద్రబాబు కుప్పం పరిగెత్తుకుంటా వచ్చారని అంటున్నారు. మొత్తమ్మీద చంద్రబాబు కుప్పం పర్యటనపై సోషల్ మీడియాలో జోకులు విపరీతంగా పేలుతున్నాయి. తమ ఎమ్మెల్యేని చాలా కాలం తర్వాత తమకు ప్రత్యక్షంగా చూపించినందుకు సీఎం జగన్ కు కుప్పం ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని కామెడీ పండిస్తున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: