భీమవరం ఎమ్మెల్యే పై జనసేనాని ఘాటు విమర్శలు..
ఆయనకు ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ప్రత్యర్థుల్ని హింసించటమే వైకాపా నాయకుల డీఎన్ఏగా ఉందని, పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాన్ని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు అనేక నియోజకవర్గాల్లో దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.వీరవాసరం మండలం మత్స్యపురిలో సర్పంచిగా ఎన్నికైన ఎస్సీ మహిళ కారేపల్లి శాంతిప్రియ, మత్స్యకారురాలైన వార్డు సభ్యురాలు చింతా అనంతలక్ష్మి, ఇతర వార్డు సభ్యుల ఇళ్లపై దాడులు చేసి, బయట ఉన్న కార్లు పగలగొట్టి, ద్విచక్రవాహనాలు ధ్వంసం చేశారని వివరించారు. శాంతిప్రియ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తుంటే ఆమెపై దాడి చేయటం తీవ్ర ఆవేదనని కలిగించిందని మండిపడ్డారు.
భీమవరంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే స్థానిక ఎమ్మెల్యే ఆగడాల్ని అరికట్టాలి. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే సంయమనం మాకు లేదు. ఆ తర్వాత మమ్మల్ని ఏమీ అనొద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చెబుతున్నా. ఎస్సీల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని వారిపైనే ప్రయోగించే స్థాయికి వైకాపా దిగజారింది. ఎస్సీ మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారు. అందుకు తలొగ్గి కేసులు పెడితే మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం.. మావాళ్ళు ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం.. వాళ్ళు దాడులు చేస్తే ఊరుకోం అంటూ పవన్ అన్నారు. సమన్వయం పాటించడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి..అంటూ జనసేన కార్యకర్తలకు హిత బోధ చేశారు.