చంద్రబాబు చెంతకే మళ్లీ పవన్ కల్యాణ్..? బీజేపీతో కటీఫ్..?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మళ్లీ టీడీపీకి దగ్గరవుతున్నారా.. బీజేపీతో దోస్తీతో తనకు రాజకీయంగా ఒరిగేదేమీ లేదని ఆయన భావిస్తున్నారా.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో కూడా జనసేన టీడీపీ దోస్తీ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయా.. ఇప్పుడు ఇదీ జనసేన సర్కిల్లో బాగా జరుగుతున్న చర్చ. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ బీజేపీని పెద్దగా నమ్ముకోలేదని.. టీడీపీతో చాలాచోట్ల అవగాహన కుదుర్చుకోవడం ద్వారానే కాస్త చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

జనసేన కూడా సందర్భం కోసం ఎదురుచూస్తోందని..  వీలుచూసుకుని బీజేపీకి చెల్లుచీటీ ఇవ్వడానికి జనసేనాని సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఓ పత్రిక రాసుకొచ్చింది. పవన్‌ కల్యాణ్‌పై పార్టీ నాయకుల నుంచి ఈ మేరకు ఒత్తిడి పెరుగుతోందని..  అయినా వచ్చే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతూ బతికేయడానికి అలవాటుపడిన బీజేపీ నేతలకు వారికి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడం ఇష్టం ఉండదంటూ ఘాటుగా రాసింది ఆ పత్రిక.
 
బీజేపీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ పార్టీకే మంచిదట. నిజానికి రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ బలంగా లేదు. ఇటీవలి కాలంలో ఆ పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా లభించలేదు. వీర్రాజు అండ్‌ కో పార్టీని అధికార వైసీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారని బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారట. వీర్రాజు, విష్ణువర్ధన్‌‌ రెడ్డి, జి.వి.ఎల్‌ నరసింహారావు, సునీల్‌ దేవధర్‌ పార్టీ ప్రయోజనాలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా  పని చేస్తున్నారని సదరు పత్రిక రాసుకొచ్చింది.

రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటమాడుతోందన్న అభిప్రాయం ఈ సందర్భంగా ప్రబలంగా వినిపించిందని... అమరావతి, పోలవరంతో పాటు ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ఆ పార్టీ వైఖరిని ప్రజలు తూర్పారబడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ పట్టుమని పది స్థానాలు కూడా గెలుచుకోలేదన్న సంగతి తెలిసిందే. అందుకే బీజేపీని నమ్ముకుంటే లాభం లేదని గమనించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: