పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ మాస్టర్ ప్లాన్..?

Satya
విశాఖ మేయర్ పీఠం అన్నది తెలుగుదేశం పార్టీ కోరిక. మూడున్నర దశాబ్దాల క్రితం ఎపుడో మేయర్ సీటుని టీడీపీ దక్కించుకుంది. ఆ తరువాత మూడు ఎన్నికలు జరిగినా టీడీపీకి మేయర్ కుర్చీ అందని పండే అయింది. కానీ ఈసారి మాత్రం అలా జరగకూడదని టీడీపీ గట్టిగా ఒట్టేసుకుంది.
దానికి తగిన ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతోంది. విశాఖలో బలంగా ఉన్న వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. విశాఖ జీవీఎంసీ పరిధిలోకి గాజువాక, పెందుర్తి వస్తాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో వామపక్షాలు మంచి బలం ఉంది. అలాగే పారిశ్రామికవాడగా చెప్పుకునే గాజువాకలో గెలుపోటములను వామపక్షాలు ప్రభావితం చేస్తాయి. దాంతో వారిని ఈ ఎన్నికల ద్వారా పొత్తులకు టీడీపీ ఆహ్వానించింది. చిత్రమేంటి అంటే ఈ ఎన్నికల్లో వామపక్షాలకు టీడీపీ ఇచ్చే సీట్లు కేవలం రెండే. మొత్తం 98 సీట్లలో వారికి రెండు మాత్రమే వదిలి మొత్తానికి మొత్తం టీడీపీ పోటీ చేస్తోంది. గాజువాక పరిధిలోకి వచ్చే 72 వార్డుని సీపీఐకి కేటాయించారు. అలాగే 78 వార్డుని సీపీఎం కి కేటాయిస్తూ టీడీపీ తుది విడత జాబితా విడుదల చేసింది.
గాజువాకలో ఇపుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యయం ఊపేస్తోంది. దాంతో పాటు కార్మిక లోకం కూడా పెద్ద సంఖ్యలో ఉంది. దాంతో వారిని ఆకట్టుకోవాలంటే వామపక్షాలతో మైత్రి అవసరం అని టీడీపీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. దాంతో రెండు సీట్లు వారికి ఇచ్చినా వామపక్షలా ఓట్లు గుత్తమొత్తంగా టీడీపీ అభ్యర్ధులకు పడతాయని అంచనా వేస్తోంది.  మరో వైపు టీడీపీ ప్రచారం అంతా కూడా వైసీపీ మీద దాడిగానే ఉంది. ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతూంటే వైసీపీ చూస్తూ ఊరుకుంది అన్న విమర్శలు కూడా చేస్తోంది. దీంతో అధికార పార్టీకి ఉక్కు సెగ తప్పదా అన్న చర్చ కూడా వస్తోంది. మరి టీడీపీ ఆశలు నెరవేరుతాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: