పురపోరు: బాలయ్యని ఇబ్బంది పెడుతున్న బాబు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అయితే ఆ తర్వాత రోజు రోజుకీ ఎమ్మెల్యేలు చేజారుతూనే ఉన్నారు. ముందుగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. తాజాగా గంటా శ్రీనివాసరావు పార్పీ మార్పుపై వార్తలొస్తున్నాయి. గంటా ఆ వార్తల్ని ఘండించినా, ఆయన ఎప్పుడో ఒకసారి పార్టీ మారతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ తరపున ప్రజల్లో తిరగకపోతే పార్టీ పరిస్థితి అధోగతేనని భావిస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీకి రాబోయేవి మరింత గడ్డురోజులేననే భయం ఆయనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే సీమపై ఫోకస్ పెట్టిన బాబు ఇటీవలే సొంత నియోజకవర్గం కుప్పంకి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత చిత్తూరు పర్యటన ఖరారు చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు బావమరిది బాలయ్యను హిందూపురంలో కలియదిరగమని ఆదేశాలిచ్చారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజునుంచి తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సుగురు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాలయ్య ప్రచారం మొదలైంది. మోత్కుపల్లి, విద్యానగర్, బోయపేట, నింకంపల్లి, మేలపురం విజయనగర్ కాలనీ, ముదిరెడ్డిపల్లి , సింగిరెడ్డిపల్లిలో మొదటి రోజు ఎన్నికల ప్రచారం చేపట్టి.. మరికొన్నిరోజులపాటు హిందూపురంలోనే ఉంటారు బాలయ్య. ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య మున్సిపల్ పోరుకోసం హిందూపురం చేరుకున్నారు.