ఓటీటీలో అన్నీ న‌గ్నాలే

Garikapati Rajesh
దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని... దీనిపై నియంత్రణ అవసరమని భార‌త సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పోర్న్ కంటెంట్‌ నియంత్రణకు ఒక యంత్రాంగం తప్పనిసర‌ని పేర్కొంది. ఓటీటీల్లో  కంటెంట్ నియంత్ర‌ణ‌కు ఇటీవ‌ల కేంద్రం రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని న్యాయ‌మూర్తి ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో  'తాండవ్' సినిమా వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
తాండ‌వ్ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అమెజాన్ టీమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇండియా చీఫ్ అపర్ణ పురోహిత్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్క‌డ చుక్కెదురైంది. హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది.
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయ‌ని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంద‌ని
బెంచ్‌లోని న్యాయమూర్తుల్లో ఒకరైన ఆర్ఎస్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'తాండవ్ వివాదం విషయంలో అపర్ణపై కేసు పెట్టడం షాకింగ్‌‌గా అనిపించింది. ఎందుకంటే, ఆ సినిమాకు ఆమె నిర్మాత కాదు.. అందులో నటి అంతకన్నా కాదు,..అయినప్పటికీ ఆ సినిమాకు సంబంధించిన వివాదంపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసుల్లో ఆమె పేరు  చేర్చారంటూ అప‌ర్ణ త‌రఫు న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గి వాదించారు.
తాండవ్ సినిమాలో హిందువుల‌ మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మతాల మధ్య చిచ్చుపెట్టే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల నుంచి బయటపడేందుకు అమెజాన్ టీమ్ సతమతమవుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు బుధవారం క్షమాపణలు కోరింది. కేసును శుక్ర‌వారానికి కోర్టు వాయిదా వేసింది. ఒక‌వేళ కోర్టు బెయిల్ నిరాక‌రిస్తే అమెజాన్ బృందం అరెస్ట‌య్యే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: