పురపోరు: బాలయ్య ప్రచారంపై మొదలైన దుష్ప్రచారం..
వాస్తవం ఏంటి..?
హిందూపురంలో బాలకృష్ణ ఎప్పుడు పర్యటించినా జనం భారీగానే హాజరవుతారు. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మూడు రోజులుగా అక్కడే మకాం వేశారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోనూ కలియదిరుగుతున్నారు. ఈ సందర్భంలో జన సమీకరణ కూడా ఎండల్లో సాధ్యమయ్యే పనికాదు. అయితే బాలయ్యకు ప్రజాదరణ లేదని చెప్పడం సరికాదని అంటున్నాయి పార్టీ వర్గాలు.
మరోవైపు బాలయ్య తన ప్రచారంలో అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ‘పాలక పక్షం వారు అధికార దర్పంతో జనాన్ని బెదిరిస్తున్నారు. దళారులను అడ్డంపెట్టుకొని రైతుల నుంచి అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. అవకాశం వస్తే పంచభూతాలను సైతం అమ్మేస్తారు. ఇలాంటి వారికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి’ అని హిందూపురంలో పిలుపునిచ్చారు బాలకృష్ణ. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయకపోతే పింఛన్లు నిలిపేస్తామని బెదిరించే వారిని నిలదీయాలని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలని, పాలకపక్షం వారికి కర్మాగారం, కారాగారానికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఓట్లు అడగటానికి వచ్చే వైసీపీ నాయకులను రెండేళ్లు ఏం అభివృద్ధి చేశారని నిలదీయాలని చెప్పారు. రోడ్ షో తోపాటు, పలుచోట్ల నడుచుకొంటూ వెళ్లి ఓటర్ల మద్దతు కోరారు బాలకృష్ణ.
మొత్తమ్మీద కుప్పం నియోజకవర్గ పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేక ఫలితాలతో చంద్రబాబు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. కనీసం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన ప్రాంతాల్లో అయినా మున్సిపాల్టీల్లో పరువు దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారు బాబు. అందుకే నాయకుల్ని ప్రచారంలోకి దించారు.