పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ.... ఎక్కడో తెలుసా ?
ఈ 9 మున్సిపాల్టీల్లో రామచంద్రాపురం ఇప్పటికే వైసీపీ ఖాతాలో పడింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం అయిన తునిలో కూడా టీడీపీ చేతులు ఎత్తేయడంతో ఇక్కడ కూడా వైసీపీ సులువుగానే మున్సిపాల్టీపై పాగా వేయనుంది. ఇక 7 మున్సిపాల్టీల్లో చూస్తే పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురం, గొల్లప్రోలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల కూడా వైసీపీ గెలుపు సులువే అంటున్నారు. ఇక జగ్గంపేట నియోజకవర్గంలోని ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న సామర్లకోటలోనూ వైసీపీ గాలులే వీస్తున్నాయి.
ఇక జిల్లా మొత్తం మీద కాస్తో కూస్తో టీడీపీకి ఆశ ఉన్న ఒకే ఒక మున్సిపాల్టీ మండపేట. ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాథినిత్యం వహిస్తున్నారు. పైగా ఆయన మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన గతంలో కూడా ఇక్కడ మునిసిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో జిల్లాలో అన్ని చోట్లా టీడీపీ ఓడినా మండపేటలో మాత్రం గెలిచింది. పైగా ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఇన్ చార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తులు కూడా నాన్ లోకల్.. ఆయన రామచంద్రాపురం వాసి... ఆయన అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా ... మండపేట ఇన్ చార్జ్‌గా ఉన్నా పెద్ద పట్టులేదు. మరి ఈ ఒక్క మున్సిపాల్టీలో టీడీపీ గెలిచి పట్టు నిలుపుకుంటుందా ? లేదా ? అన్నది చూడాలి.