పుర పోరు: చిత్తూరులో ప్రచారంలో జోరు పెంచిన వైసీపీ..
చిత్తూరు నగర పాలిక, మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు పురపాలక సంఘాల పరిధిలో రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా.. అన్నట్లుగా తెగ తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. వివిధ పార్టీల నేతలు, అనుచరులు తమ అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నగర, పట్టణాల వీధుల్లో హోరాహోరీ ప్రచారాలే సాగుతున్నాయి. ప్రలోభాలు, బెదిరింపు పర్వాలు కొనసాగుతున్నాయి. పుంగనూరులో అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం, శ్రీకాళహస్తిలో న్యాయస్థానం తీర్పుతో ఎన్నిక ఆగడం, కుప్పం కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘం కావడంతో ఇక్కడ ఎన్నికలు లేవని తెలుస్తుంది.
నగర, పురపాలక పోలింగ్‌కు ఏర్పాట్లు కూడా కొలిక్కివస్తున్నాయి. ఓటర్లకు స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చింది. పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రి సరఫరా ముమ్మరంగా సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగించడానికి జిల్లా కలెక్టరు హరి నారాయణన్, చిత్తూరు, తిరుపతి అర్బన్ ఎస్పీలు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈనెల 10న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన పక్షంలో 13న రీపోలింగ్ జరుగుతుంది. ఈనెల 14న ఓట్ల లెక్కిస్తారు... పార్టీ గుర్తులతో జరుగుతున్న ఈ ఎన్నికలను కీలకంగా భావించిన ఎన్నికల కమీషన్ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది