పుర పోరు: తిరుపతి కార్పొరేషన్ ఆ పార్టీదేనా ?
తిరుపతి నగరపాలిక ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికార పార్టీ నేతలు శనివారం రాత్రే ప్రలోభాలకు తెరదీశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నగరపాలిక పరిధిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద తెదేపా నాయకుడిపై దాడికి పాల్పడటంతో వివరాలు ఆరా తీసిన తెదేపా నాయకత్వం నగదు పంపకాన్ని గుర్తించి దానిని ఎక్కడ బయటపెడతాడో అన్న సందేహంతోనే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. తిరుపతి నగరపాలిక సంస్థ పరిధిలో ఆదివారం 27 వార్డుల్లో పెద్దఎత్తున ఎన్నికల ప్రచారం సాగింది. వందలాది మందితో ర్యాలీలు నిర్వహించారు. వైకాపా, తెదేపా, భాజపా, జనసేన, సీపీఐ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం భారీగా చేశారు.
ఎన్నికల్లో నగదు పంపిణీ సాధారణగా పోలింగ్ ముందు రోజు నిర్వహిస్తుంటారు. అయితే వైకాపా ముందస్తుగా నగదు పంపిణీ ప్రక్రియను ప్రారంభించి ఆదివారం రాత్రికి ముగించినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముందు రోజు ఇతర పార్టీలకు నగదు పంపిణికీ అవకాశం ఇవ్వకుండా ఓటర్లను తమ వైపు లాక్కునే ఎత్తుగడలో భాగంగా ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నగరపాలిక పరిధిలో పనిచేస్తున్న కొందరు వార్డు వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విపక్ష నేతలు దుయ్యబట్టారు.. వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల అధికారులు అప్పగించిన విధులను విస్మరించి, ఓటరు స్లిప్పుల పంపిణీకి అనధికారికంగా వారి పరిధిలోని వార్డు వాలంటీర్లకు అప్పగించడంతో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతున్నట్లు తెదేపా నేతలు ఆరోపించారు. కొందరు వాలంటీర్లు ఓటరు స్లిప్పులను సంబంధిత ఓటరుకు చూపి తమ వద్దే ఉంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల వారిని దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని విపక్ష నేతలు అంటున్నారు..ఎలా చూసుకున్నా తిరుపతి కార్పొరేషన్ వైసీపీ కి అనుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా ఉండబోతుందో మార్చి 14 న తెలియనుంది..