సొంత పార్టీ కొంప ముంచుతున్న వైసీపీ ఎంపీలు.. ఎలాగంటే..?
ఒకటి కాదు.. రెండు కాదు.. ఇటీవల మూడు ప్రశ్నల విషయంలో ఇదే జరిగింది. ముందుగా రామాయపట్నం పోర్టు విషయంలో సరిగ్గా ప్రశ్న అడకపోవడం వల్ల.. చిన్న పోర్టుల విషయంలో కేంద్రం ఏమీ చేయలేదు.. వాటిపై తమ బాధ్యత లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఇక అదే సమయంలో విశాఖ పోర్టు అంశంపై కూడా వైసీపీ సరిగ్గా ప్రశ్నను సంధించలేకపోయింది. సింపుల్‌గా విశాఖ స్టీల్ ప్లాంట్ పై మీ అభిప్రాయం ఏంటి అని అడగటం వల్ల ప్రయోజనం ఉండదు.. ఇప్పుడు అదే జరిగింది. అలా అడగటం వల్ల.. ఈ అంశంలో రాష్ట్రాన్ని సంప్రదిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పుడు ఇదే అంశాన్ని టీడీపీ హైలెట్ చేస్తోంది.
కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నాయని టీడీపీ నాయకులు విమర్శించేందుకు అవకాశం దక్కింది. ఇక మరో అంశం పోలవరం.. పోలవరం విషయంలో జగన్ ఇచ్చిన వినతి పత్రం ఏమైందని అడిగారు తప్ప.. పోలవరం నిధుల సంగతేంటి అంటూ సూటిగా అడిగి ఉంటే బావుండేది.. వినతిపత్రం ఏమైంది.. అని అడిగితే.. అది హోంమంత్రి దగ్గర ఉండి ఉంటుంది.. మా వరకూ రాలేదన్న సమాధానం వచ్చింది.
ఇలా ఏదైనా.. పార్లమెంటులో ప్రశ్నల అడగటంలో వైసీపీ ఎంపీలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల.. అవి కాస్తా పార్టీకే గుదిబండగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి ప్రశ్నోత్తరాలను కమ్యూనిస్టులు బాగా ఉపయోగించుకునేవారు.. ఈ విషయంలో వైసీపీ ఎంపీలు నిపుణుల సలహాలు తీసుకుంటే బెటర్.