చరిత్రలోనే లేదట.. నిమ్మగడ్డ ఫుల్ హ్యాపీస్.. ఎందుకంటే..?
రాష్ట్రంలో పంచాయతీ, పురపాలిక ఎన్నికలు జరిగిన తీరుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ లేకుండా పంచాయతీ పురపాలిక ఎన్నికలు ముగియడం ఇదే తొలిసారి అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికలు విజయవంతం కావడానికి అధికారుల సమష్టి కృషి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంటున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు , పోలీసు కమిషనర్లు సమర్ధంగా పనిచేశారని ఆయన కితాబిచ్చారు.
సమర్థంగా పోలింగ్ నిర్వహించడానికి తోడ్పడిన అందరికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభినందనలు తెలిపారు. జరిగిన ఘటనలపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులను కోరామన్నారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొన్న ఘటనలు నమోదు చేసి హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్లలో 57.14శాతం, మునిసిపాలిటీల్లో 70.65శాతం పోలింగ్ జరగడం సంతృప్తి కల్గించిందంటున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
ఈనెల 14న పురపాలిక ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. మేయర్, డిప్యూటీ మేయర్,చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వంతో మొదట్లో ఘర్షణ వైఖరి అవలంభించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆ తర్వాత మొత్తానికి అంతా సవ్యంగా పూర్తి చేశారు. తానూ సంతృప్తిగా ఉన్నారు.