డ్రైవర్ తాగి నడిపితే.. ప్రయాణికులకు కూడా తిప్పలే..

Deekshitha Reddy
డ్రంకెన్ డ్రైవ్ తో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో లెక్కే లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అజాగ్రత్త వల్ల జరిగేవి కొన్ని అయితే, మందుబాబులు బండ్లు నడపడం వల్ల జరిగేవి మరికొన్ని. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లుచేపడుతున్నా, నిబంధనలు కఠినతరం చేస్తున్నా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అయితే ఇప్పుడు దీనికి మరో కొత్త నిబంధన అదనంగా చేర్చారు అధికారులు. బండి తాగి నడిపితే డ్రైవర్ తోపాటు, ప్రయాణికులపై కూడా కేసు నమోదు చేయబోతున్నారు. అంటే డ్రైవర్ బండి నడిపే ముందు తాగి ఉన్నాడా లేక, మామూలుగా ఉన్నాడా అని చెక్ చేసుకోవడం ఇకపై ప్రయాణికుల బాధ్యత కూడా.

కొన్ని సందర్భాల్లో స్నేహితులు, బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు వెళ్లేందుకు, ఇతర పనుల నిమిత్తం డ్రైవర్ ని కుదుర్చుకుని, లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరు డ్రైవర్ గా మారి వెళ్లి వస్తుంటారు. అయితే అలాంటి సందర్భాల్లో డ్రైవర్ తాగి బండి నడుపుతున్నా పక్కన ఉన్నవారు పట్టించుకోరు. మనోడే కదా మనకి భద్రత లేకుండా పోతుందా అని లైట్ తీసుకుంటారు. కానీ ఇకపై అలాంటి అజాగ్రత్త పనికిరాదు. మనోడే కదా అని వదిలేస్తే, ఆ బండి ప్రమాదానికి గురయినా, లేక డ్రంకెన్ డ్రైవ్ లో వెహికల్ పట్టుబడినా ప్రయాణికులు కూడా బాధ్యులుగా మారతారు. వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. డ్రండెన్ డ్రైవ్ తోపాటు, డ్రంకెన్ డ్రైవ్ ని ప్రోత్సహించినందుకు ప్రయాణికులు కూడా నేరస్థులుగా మారాల్సిందేనంటున్నారు అధికారులు.

మోటారు వాహనాల చట్టం-1988 సెక్షన్‌ 188 ప్రకారం వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని తెలిసీ.. అతడి వాహనంలో  ప్రయాణించే వ్యక్తులు కూడా జైలుకెళ్లాల్సి వస్తుందని సైబరాబాద్ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. దీనిపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. ఆటోలో, క్యాబ్‌లో.. స్నేహితులు, బంధువుల వాహనాల్లో వెళ్లే వారు వాహనం నడిపే వ్యక్తి తాగిన మత్తులో ఉన్నాడా..? లేదా అనే విషయం చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్‌ నిబంధనల్లో భాగంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ విధానం అమలులోకి తెచ్చామంటున్నారు అధికారులు. ఇకపై తాగి బండి నడిపేవారే కాదు, వారి పక్కన ఉన్నవాళ్లు కూడా అడ్డంగా బుక్కైపోయినట్టేననమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: