ప్రపంచ కుబేరులనే వెనక్కి నెట్టేసిన అదానీ.. ఏడాదిలో రికార్డు సంపాదన..?
ఇంతకీ ఆ మొనగాడు ఎవరంటారా.. అతడే గౌతమ్ అదానీ.. గుజరాతీ పారిశ్రామిక వేత్త. అవును.. భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ సంపాదన ఈ ఏడాదిలో భారీగా పెరిగింది. అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్ మస్క్, బెజోస్ కంటే అదానీ ఈ ఏడాది సంపాదనలో ముందున్నారు. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాదిలో 16.2 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ ఏకంగా 50 బిలియన్ డాలర్లకు చేరింది.
దేశంలో సంపన్ను ఆస్తులపై సర్వే నిర్వహించే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర దూసుకెళ్లడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. ఇంతకీ అదానీ వ్యాపారాలేంటి.. అవి ఎందుకు అంతగా దూసుకెళ్తున్నాయి.. చూద్దాం.. అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్ప్రైజెస్ ముందుకొచ్చింది. అంటే సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్ అడుగుపెట్టిందన్నమాట.
అంతే కాదు.. ఈ ఒక్క ఏడాదిలో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 శాతం మేర పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 90%, అదానీ ట్రాన్స్మిషన్ 79% మేర దూసుకెళ్లాయి. ఇక అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లిమిటెడ్ వంటి కంపెనీల షేర్లు 52% మేర రాణించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక్కటి మాత్రమే 12% వృద్ధి చెందింది. గతేడాది ఈ కంపెనీ షేరు ఏకంగా 500% పెరిగింది. అందుకే అదానీ ప్రపంచంలోనే ఎక్కువగా సంపాదిస్తున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.