హైదరాబాద్: రెండేళ్ల అన్విత ఆకస్మిక మరణం యావత్ రాష్ర్టాన్ని శోకసముద్రంలోకి ముంచెత్తింది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. అన్విత మరణం ఒక తల్లి కడుపుకోత కాదు. ఒక మాత్రుమూర్తికి మిగిల్చిన గర్భశోకం అంతకంటే కాదు. చిన్న నిర్లక్ష్యం చిన్నారి అన్వితను బలి తీసుకోవచ్చు. కానీ, అన్విత చావుకు కారకులెవ్వరూ? బేబీ కేర్ సెంటర్ నిర్వహకులా? లేక తల్లిదండ్రులా? ప్రసుతానికి మాత్రం బేబీకేర్ నిర్వహకుల నిర్లక్ష్యంగానే అన్విత చనిపోయిందనీ పోలీసులు తేల్చవచ్చు. దానిని తప్పుబట్టలేం. ప్రస్తుతానికి ఎవర్నీ నిందించే టైం కూడా కాదిది.
కానీ, అన్విత ఆకస్మిక మరణానికి ఎవరు కారణమని మనమందరమూ ఒకసారి గుండెపై చెయ్యి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉరుకులు, పరుగల పట్నం లైఫ్ లో పిల్లల ఆలనా, పాలనా చూసుకునే వారే లేరు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులయితే ఇక పిల్లల సంరక్షణ చూసుకోవడం ఎంత మాత్రం కుదరదు. పొద్దున లేచింది మొదలుకుని ఆఫీస్కు వెళ్లే వరకు వారిద్దరూ తమకు సంబంధించిన పనులు చేసుకోవడానికి సరిపోతున్నారు. అరీబరీ ఈ లైఫ్ లో పిల్లల్ని చూసుకోవడానికి టైం ఎక్కడ? సరిగ్గా ఇలాంటి వారి కోసమే మహానగరంలో సుమారుగా 10వేల వరకు ‘బేబీకేర్’ సెంటర్లు వెలిశాయి.
పట్నంలో ఇవీ మనకు గల్లీ గల్లీలో దర్శనమిస్తాయి. ఈ కల్చర్ ఇప్పుడిప్పడే జిల్లాలకు కూడా పాకుతోంది. ఒకప్పుడు ‘ఉమ్మడి కుటుంబాలు’ ఉండేవి. అమ్మ, నాన్న, అత్త, మామ, బావలు, మరుదులు, తోటికోడళ్లు, తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, పిన్ని, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దబాపు, అన్నలు, అక్కలు, చెల్లెలు ఉండేవారు. వీరికి తోడుగా మంచికి, చెడుకు చుట్టు పక్కన పెద్ద మనుషులు కాపలాగా ఉండేవారు. ఏదైనా జరిగితే ఇంట్లో వారే కాదు, వాడవాడంతా కదిలేది. ముఖ్యంగా ఓ ఇంట్లో చిన్న పిల్లలకు ఏదైనా జరిగితే ఆ వాడంతా రాత్రంతా మేల్కొని ఉండేది.
కానీ, ఇప్పుడు రోజులు మారాయి. అంతా కంప్యూటర్ యుగం. యాంత్రికమైన జీవితం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న ఫ్యామీలీలు వచ్చాయి. అంటే భార్యభర్త, వారికి ఒక్కరో,ఇద్దరో పిల్లలు. ఉమ్మడి కుటంబానికి బదులుగా సింగిల్ బెడ్ రూం ఫ్యామీలీలు అన్నమాట. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం వినడానికి, చూడటానికి బాగానే ఉండవచ్చు. నిండు నూరేళ్లు బతకాల్సిన అన్విత లాంటి రెండేళ్ల పసిపాప అర్ధాంతరంగా ఆయుష్షు చాలించినప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో, దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో(చూసిన వాళ్లకు గాని దాని విలువ తెలియదు) మాటల్లో చెప్పలేం. అన్విత తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు. వారు ఉదయాన్నే 8గంటలకు తమ తమ ఆఫీసులకు వెళ్తారు. ఇంట్లో ఎవరూ ఉండరు. దీనితో రెండేళ్ల అన్వితను బేబీకేర్ సెంటర్లో విడచిపోక తప్పదు. అంత పొద్దున పిల్లలకు టిఫిన్ తినిపించే టైం కూడా ఉండదు. ఒక అన్విత తల్లిదండ్రులకే కాదు, నగరంలో అలాంటి మంది ఎందరో తల్లిదండ్రులున్నారు.
ఒంటరి కాపురాలు, అపార్ట్ మెంటు లైఫ్ కావడంతో ఇంట్లో ఎక్కువ మంది ఉండటానికి వీలుపడదు. వుంచుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. పిల్లల ఆలనా, పాలనా చూసుకునే వారు లేక, చేసేదేమీ లేక పిల్లల్ని బేబీకేర్ సెంటర్లో వదిలివెళ్తున్నారు. దీంట్లో మనమూ ఎవర్ని తప్పుబట్టడానికి వీలులేదు. అయితే, అదే ఉమ్మడి కుటుంబమయితే, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లినా పిల్లల ఆలనా, పాలనా చూసుకోవడానికి ఇంట్లో తాతనో, నాన్నమ్మనో, అమ్మమ్మనో ఎవరో ఒకరుంటారు.
ఏడిస్తే పాలు పట్టడానికి, ఆకలయితే అన్నం తినిపించడానికి. సిటీ లైఫ్ అలా కాదు. పొద్దున 8గంటలకు వెళ్లారంటే సాయంత్రం 6గంటల వరకు పిల్లల ఆలనా, పాలనా అంతా బేబీకేర్ సెంటర్ నిర్వహాకులే చూసుకోవాలి. వీరికి ఏమైనా ఒకరో, ఇద్దరో ఉంటే చూసుకునే వారేమో. కానీ, ఇక్కడ పదుల సంఖ్యలో చిన్నారులుండటం వల్ల అందర్నీ కేర్ తీసుకోవడం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. ఏది ఏమైనా ఉరుకులు, పరుగుల జీవితంలో పిల్లల ఆలనా, పాలన కూడా చూసుకునే పరిస్థితి లేకుంటే అన్విత లాంటి అమ్మలెందరికో కడుపుకోత తప్పదు.
నవ్వులు దొర్లాడిన చోట శ్మశాన వాతావరణం సంచరిస్తది. నిన్నటి వరకు తన చిన్నారి చూసి ఎంతో సంతోషపడిన అన్విత అమ్మ నవ్వును మనం తేగలమా? పోయిన ప్రాణాల్ని తేలేము. అన్విత ఆకస్మిక మరణానికి ఫలాన వారే కారణమనీ కాకుండా, అన్విత తల్లిదండ్రులకు జరిగిన కడుపుకోత మరెవరికీ జరగకూడదనీ ఆ దేవుణ్ణి కోరుకుందాం. తల్లిదండ్రులూ జర ఆలోచించండి.
మరింత సమాచారం తెలుసుకోండి: