ఢిల్లీ రైతు సంఘాల నేతల హత్యకు ప్లాన్..!

yekalavya
న్యూఢిల్లీ: రైతు సంఘాల నేతలను చంపేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడిని రైతులు పట్టుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నాయకులను చంపేందుకు అతడు వచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అతడి ద్వారానే రైతులు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 26న జరగనున్న ట్రాక్టర్ ర్యాలీని విఫలం చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నలుగురు రైతు సంఘం నాయకులను కాల్చిచంపేందుకు రెండు బృందాలను తిరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. తాము పట్టుకున్న నిందితుడి పేరు ప్రదీప్ అని, అతడే ఈ విషయాన్ని వెల్లడించాడని వారు చెబుతున్నారు. జనవరి 26వ తేదీన రైతుల తలపెట్టిన ర్యాలీ సందర్భంగా ముఖ్యమైన నలుగురు నేతలను హత్య చేసి ర్యాలీని భగ్నం చేయడమే ఈ బృందాల ఉద్దేశ్యమని రైతులు చెబుతున్నారు. రైతు నేతల హత్యకు పథకం పన్నిన ముఠా సభ్యుడు ప్రదీప్ ముసుగు వేసుకొని సంచరిస్తుండగా తాము పట్టుకున్నామని, ఆ తర్వాత పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు. తమ ఆందోళనకు భంగం కలిగించేలా దుర్మార్గపు కుట్ర పన్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
శుక్రవారం రాత్రి రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ర్యాలీలో రైతుల సమూహాలను చెదరగొట్టడానికి సగం మంది ముఠా సభ్యులు పోలీసు యూనిఫాం ధరించి హాజరయ్యేందుకు సిద్ధమైనట్లు తమకు తెలిసిందని చెప్పారు. ఇక మిగతా సగం మంది సభ్యులు ట్యాక్టర్ ర్యాలీ సందర్భంలో రైతులతో కలిసిపోయి రైతు సంఘాల నేతలపై కాల్పులు జరిపేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. ఈ పనికోసం సదరు ముఠా సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10వేల సుపారీ ఇచ్చారని, తాము డబ్బు కోసమే ఈ పనిచేస్తున్నామని పట్టుబడిన వ్యక్తి చెప్పినట్లు రైతులు వివరించారు. అయితే దీనికి సూత్రధారి ఎవరు..? దీని వెనక ఎవరున్నారు..? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: