స్కూళ్లు, కాలేజీలకు అనుమతులిచ్చేశారు.. మరి ఉపాధ్యాయుల జీతాల సంగతేంటి జగన్ సార్?

frame స్కూళ్లు, కాలేజీలకు అనుమతులిచ్చేశారు.. మరి ఉపాధ్యాయుల జీతాల సంగతేంటి జగన్ సార్?

అమరావతి: కరోనా కారణంగా విద్యావ్యవస్థ గాడి తప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యావ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఏపీలో స్కూళ్లు, కాలేజీ  విద్యార్థులకు తరగతులు ప్రారంభమైపోయాయి. కరోనా కారణంగా గతేడాది నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. కరోనా లాక్‌డౌన్‌లో భాగంగా ప్రైవేటు స్కూళ్ల, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో క్లాసులను చెబుతున్నప్పటికి ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి మొత్తం ఫీజును వసూలు చేస్తున్నాయి. కానీ ఉపాధ్యాయులకు మాత్రం మొండి చేయిని చూపిస్తూ వస్తున్నాయి. కరోనా పేరు చెబుతూ యాజమాన్యాలు ఉపాధ్యాయులకు కేవలం 20 నుంచి 30 శాతం జీతాన్ని మాత్రమే చెల్లిస్తున్నాయి. తమ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో సగానికి సగం మందిని విధుల నుంచి తొలగించి, మిగతా వారికి కనీసం 50 శాతం జీతాన్ని కూడా చెల్లించకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ వస్తున్నాయి. విద్యార్థుల నుంచి మాత్రం 100 శాతం ఫీజును వసూలు చేసేస్తున్నాయి.
ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ఏపీకి చెందిన అనేక మంది ఇండియా హెరాల్డ్‌ను సంప్రదించారు. ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతినివ్వడం మంచి విషయమే కానీ, ఉపాధ్యాయుల జీతం సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గడిచిన పది నెలలుగా కేవలం ఐదు, ఆరుగురు ఉపాధ్యాయులతో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తూ వారికి కేవలం 20 నుంచి 30 శాతం జీతాన్నే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే ఓ జీవోను పాస్ చేయాలంటూ సదరు వ్యక్తులు సీఎం జగన్‌ను కోరారు.
విద్యార్థుల నుంచి కేవలం 40 శాతం ఫీజును మాత్రమే వసూలు చేసేలా, సిబ్బందికి ఇన్ని నెలలు కట్ చేసిన జీతాన్ని తిరిగి వారి బ్యాంకు ఖాతాలకు యాజమాన్యాలు పంపించేలా జీవోను పాస్ చేయాలని కోరుతున్నారు. లేకపోతే అసలు అనుమతులే ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి మొత్తం ఫీజును వసూలు చేసి ఉపాధ్యాయులకు జీతం కూడా ఇవ్వకపోవడంపై ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి సార్ అంటూ సదరు వ్యక్తులు సీఎం జగన్‌ను అడుగుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: